ఆరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

2 Mar, 2019 15:15 IST|Sakshi

కాంగ్రెస్‌తో పొత్తు లేకుండానే ఢిల్లీలో ఆప్‌ పోటీ..

ఏడు స్థానాలకు ఆరు స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసిన పార్టీ

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఢిల్లీలో ఉన్న ఏడు లోక్‌సభ స్థానాలకు గాను ఆరు సీట్లకు శనివారం అభ్యర్థులను ప్రకటించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని.. మహాకూటమిగా వెళ్లాలని ఆప్‌ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే, ఆప్‌ ప్రయత్నానికి కాంగ్రెస్‌ పార్టీ గండి కొట్టింది. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ.. ఆప్‌ ఢిల్లీ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌  ఆరు స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.  

కేంద్రంలో బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా రాష్ట్రాల్లో అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కోసం ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా ప్రయత్నించారు. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కాంగ్రెస్‌-ఆప్‌ కలిసి పోటీ చేయాలని ఆయన ప్రతిపాదించారు. అయితే, ఆయన ప్రతిపాదనకు ఢిల్లీ కాంగ్రెస్‌ శాఖ మోకాలడ్డింది. ఢిల్లీ పీసీసీ చీఫ్‌ షీలా దీక్షిత్‌ సహా స్థానిక నేతలు ఆప్‌తో పొత్తుకు నిరాకరించడంతో పొత్తు పెట్టుకోలేదని శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో కేజ్రీవాల్‌కు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారని గోపాల్‌ రాయ్‌ తెలిపారు.

ఆప్‌ ప్రకటించిన ఆరుగురు అభ్యర్థులు వీరే: ఆతిషి (ఢిల్లీ ఈస్ట్), గుగ్గన్ సింగ్ (నార్త్ వెస్ట్), రాఘవ్ చద్ధా (సౌత్), దిలీప్ పాండే (నార్త్ ఈస్ట్), పంకజ్ గుప్తా (చాందిని చౌక్),  బ్రిజేష్ గోయల్ (న్యూఢిల్లీ).

మరిన్ని వార్తలు