మీటింగ్‌ అయ్యాక గిటార్‌ వాయించే సీఎం! ఆయనో డిఫరెంట్‌ ‘ట్యూన్‌’

18 Nov, 2023 21:16 IST|Sakshi

నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపుతుంటారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే కొందరు సీఎంలు మాత్రం ఏదో ఒక వ్యాపకంతో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా (Meghalaya Chief Minister Conrad Sangma) ఒకరు. ఐరన్ మైడెన్ పాటకు ఆయన ఎలక్ట్రిక్ గిటార్‌పై వాయిస్తున్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

కాగా తన సంగీత అభిరుచి గురించి మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మా పలు ఆసక్తి వివరాలను ‘హిందూస్తాన్‌ టైమ్స్‌’తో పంచుకున్నారు. సంగీతం తనకు అంతులేని ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడూ సంగీతంలోనే ఉంటానని, అవకాశం దొరికినప్పుడల్లా ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేస్తానని చెప్పారు.  క్యాబినెట్ సహచరులతో ఉన్నప్పుడు, ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాల అనంతరం లైవ్‌ ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడుతుంటానని తెలిపారు. 

జీ20 సమావేశాల్లో ప్రదర్శన
తన సహచరులతో డిన్నర్‌లో కలిసినప్పుడు తప్పకుండా గిటార్‌ వాయిస్తానని, సంగీతం తన సంస్కృతిలో అంతర్భాగమని చెప్పుకొచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైనా విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పుడు, తన సంగీతాన్ని విని ఆ అసంతృప్తిని మరచిపోతారని వెల్లడించారు. ఇటీవల జీ20 సమావేశాల్లో తన ప్రదర్శను రాయబారులు, సహచరులందరూ ఆనందించారని పేర్కొన్నారు.

యువతకు ప్రోత్సాహం
తాను యువకుడిగా ఉన్నప్పుడు తన బ్యాండ్‌కి సంగీతాన్ని రికార్డ్ చేయడానికి స్టూడియో ఉండేది కాదని చెప్పుకొచ్చిన ఆయన రాష్ట్రంలో సంగీత కళాకారుల కోసం మరిన్ని స్టూడియోలను తీసుకురావలనుకుంటున్నట్లు తెలిపారు. సంగీత అవకాశాలతో పాటు, సినిమాలకు లొకేషన్‌గా మేఘాలయ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మేఘాలయ యువత సినిమా నిర్మాణంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇందు కోసం సినిమా థియేటర్ల ఏర్పాటును ప్రోత్సహించడానికి భారీ రాయితీలు అందిస్తున్నామన్నారు. యువ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి రాష్ట్రం తరఫున సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు