ఆర్జేడీలో అన్నదమ్ముల పోరు?

11 Jun, 2018 03:27 IST|Sakshi

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. లాలూ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ చేసిన ట్వీట్‌ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చిన్న విషయాన్ని భూతద్దంలో చూడవద్దని చిన్న కొడుకు తేజస్వీయాదవ్‌ పార్టీ శ్రేణులను కోరినప్పటికీ ఇద్దరి మధ్య అంతరం పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. ‘అర్జునుడిని హస్తినాపురం సింహాసనంపై కూర్చోబెట్టి ద్వారకకు తిరిగెళ్లిన కృష్ణుడిలా ఉండాలనుకుంటున్నా’ అని తేజ్‌ ప్రతాప్‌ ట్వీట్‌ చేశారు.

దాంతో ఎన్నికల అనంతరం సోదరుడు తేజస్వీయాదవ్‌ను ముఖ్యమంత్రిగా చేసి, ఆ తరువాత ఆయన రాజకీయాల నుంచి రిటైర్‌ కానున్నారనే వార్తలు ఆర్జేడీ వర్గాల్లో వ్యాపించాయి. అనంతరం తేజ్‌ ప్రతాప్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పార్టీలోనే కొనసాగుతా. ఆర్జేడీని స్థాపించిన మా తండ్రి, ఈ స్థాయికి తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు. కొందరు లోపలి వ్యక్తుల కారణంగా పార్టీకి హాని కలుగుతోంది. అవి సంఘ వ్యతిరేక శక్తులు. వాళ్లు మా తల్లిదండ్రులు, తేజస్వీ, మిసా(సోదరి, రాజ్యసభ ఎంపీ), నా పేరు వాడుకుని స్వార్థం కోసం పార్టీని నాశనం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. దీనిపై తేజస్వీ స్పందిస్తూ..‘మా అన్నతో నాకు అభిప్రాయ భేదాలున్న మాట అవాస్తవం. తేజ్‌ప్రతాప్‌ నాకు సోదరుడు, మార్గదర్శకుడు. చిన్న విషయాలను పెద్దగా చూడొద్దు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు