ఇక ప్రచార ‘హోరు’

21 Nov, 2018 03:58 IST|Sakshi

ప్రజల్లోకి అన్ని పార్టీల అభ్యర్థులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తదుపరి ఘట్టానికి తెరలేచింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ఇక రాష్ట్రం మొత్తం ప్రచారంతో హోరెత్తనుంది. జాతీయస్థాయి నేతల సభలు, ప్రసంగాలతో రాష్ట్రంలో రెండువారాలపాటు ఎన్నికల సందడి నెలకొననుంది. ఎన్నికల ప్రచారంలో మొదటి నుంచీ ముందున్న అధికార టీఆర్‌ఎస్‌ పక్షాన ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తన మలివిడత ప్రచారంలోనూ ఇప్పటికే ఆరుచోట్ల సభలను పూర్తి చేసుకోగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా కూటమి పక్షాలు, బీజేపీ, సీపీఎంలతో పాటు అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. మొత్తమ్మీద వచ్చేనెల 5 వరకు రాష్ట్రం ప్రచారంలో మునిగిపోనుంది. 

కారు జోరు... 
ఈ ఏడాది సెప్టెంబర్‌ 6న ప్రభుత్వాన్ని రద్దుచేసిన మరుసటి రోజే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తన ప్రచారాన్ని ప్రారంభించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఆ తర్వాత కొంతకాలం ప్రచారానికి దూరం గా ఉన్న ఆయన.. ఈ నెల 19 నుంచి నియోజకవర్గస్థాయి సభలకు శ్రీకారం చుట్టారు. 19న ఖమ్మం, పాలకుర్తి, 20న సిద్ధిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలలో సభలు నిర్వహించిన కేసీఆర్‌.. ఈనెల 25వరకు ఈ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఈ వారం రోజుల్లో ఆయన మొత్తం 31 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత మలివిడత షెడ్యూల్‌ ఖరారు కానుంది. 

దశలవారీగా కాంగ్రెస్‌... 
కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల శంఖారావాన్ని అక్టోబర్‌లోనే పూరించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేత సభలు, సమావేశాలు నిర్వహించింది. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే ప్రచారం చేసింది. ఈనెల 23న మేడ్చల్‌లో సోనియా, రాహుల్‌లతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్‌ పక్షాన మొత్తం 40 మంది స్టార్‌ క్యాంపెయినర్‌లు ప్రచారం చేయనున్నారు. 

రాహుల్, బాబు మళ్లీ ఒకే వేదికపై... 
రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈనెల 23న మేడ్చల్‌లో సభ తర్వాత ఈనెల 29, 30 తేదీల్లో మరోమారు రాహుల్‌ రాష్ట్రానికి రానున్నారు. ఆయన హాజరయ్యే ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రానున్నారు. అనంతరం చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సుహాసిని తరఫున బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లు ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

మోదీ, అమిత్‌షా కూడా... 
బీజేపీ కూడా జాతీయ నేతలతో బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఒక విడత రాష్ట్ర పర్యటనను ముగించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. ఈనెల 25, 27, 28 తేదీల్లో మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చేనెల 3, 5 తేదీల్లో జరిగే సభలకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

వామపక్షాల అగ్రనేతలు కూడా... 
సీపీఐ అభ్యర్థులు పోటీచేసే స్థానాల్లో ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారానికి రానున్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, అగ్రనేతలు డి.రాజా, నారాయణ కూడా ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. బీఎల్‌ఎఫ్‌ కూటమిగా బరిలో ఉన్న సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బి.వి.రాఘవులు తదితరులు ప్రచారం నిర్వహించనున్నారు. 

మరిన్ని వార్తలు