సోఫియాను అరెస్ట్‌ చేయడం అక్రమమే..!

5 Sep, 2018 15:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడి విమానాశ్రయంలో సోమవారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన 28 ఏళ్ల విద్యార్థిని లోయిస్‌ సోఫియాను అరెస్ట్‌ చేయడంపై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెల్సిందే. ఇక్కడ ఎవరికి పట్టని విషయం ఏమిటంటే ఆ విద్యార్థినిపై రెండు బెయిలబుల్‌ సెక్షన్లతోపాటు ఓ నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ కింద కేసును దాఖలు చేయడం. అది కచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో నిర్లిప్తంగా ఉండే న్యాయవ్యవస్థ.. సోఫియా అరెస్టు విషయంలో తమిళనాడు పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకోలేక పోయింది.

విమానాశ్రయంలో ‘బీజేపీస్‌ ఫాసిస్ట్‌ గవర్నమెంట్‌ డౌన్‌డౌన్‌’ అంటూ కెనడాలో పీహెచ్డీ చేస్తున్న సోఫియా గట్టిగా నినాదాలు చేయడంతో తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసాయి సౌందరరాజన్‌ ఆమెతో గొడవ పెట్టుకున్నారు. అంతుకుముందు విమానంలో కూడా ఆమె అలాగే నినాదాలు చేశారని, అక్కడ తాను మౌనంగా ఉన్నానని, విమానాశ్రయంలోకి వచ్చాక అలా నినాదాలు చేయడం సబబేనా అని ప్రశ్నించగా, మళ్లీ నినాదాలు చేస్తానంటూ చేసిందని బీజేపీ నాయకురాలు ఫిర్యాదు చేశారు. విమానంలో సోఫియా నినాదాలు చేసిందనడానికి సాక్ష్యం లేదుగానీ, విమానాశ్రయంలో వారిద్దరికి మధ్య గొడవ జరగడం, సోఫియా నినాదాలు చేయడం, పోలీసులు సోఫియాను నిర్బంధంలోకి తీసుకోబోతే అటు వారికి, గొడవ చేస్తున్న బీజేపీ నాయకురాలికి తోటి ప్రయాణికులు సర్ది చెప్పడం, సోఫియాను వదిలేయాల్సిందిగా కోరడం అందుబాటులో ఉన్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

బీజేపీ నాయకురాలు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా తీసుకున్న తమిళనాడు పోలీసులు సోఫియాపై భారతీయ శిక్షాస్మతిలోని 290, తమిళనాడు పోలీసు చట్టంలోని 75 (1,సీ) సెక్షన్లతోపాటు భారతీయ శిక్షాస్మతిలోని 505 సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు. ప్రజల ముందు న్యూసెన్స్‌ సృష్టించినందుకు 290వ సెక్షన్‌ పెడతారు. ఇది బెయిలబుల్‌ సెక్షన్‌. బాండు చెల్లించి పోలీసు స్టేషన్లోనే బెయిల్‌ తీసుకోవచ్చు. ఈ సెక్షన్‌ కింద నేరం రుజువైతే 200 రూపాయలు జరిమాన విధిస్తారు. తమిళనాడు పోలీసు చట్టంలోని 75 (1,సీ) మొదటిదానికన్నా కొంచెం తీవ్రమైనది. ఇది కూడా బెయిలబుల్‌ సెక్షనే. ప్రజలు తిరుగాడే బహిరంగ ప్రదేశంలో, ఆఫీసుల్లో, కోర్టుల్లో, అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో, రవాణా వాహనాల్లో, ప్రయాణికుల బోట్లలో, నౌకల్లో ఎవరైనా హింసాత్మకంగా లేదా గట్టిగా పెడబొబ్బలు లేదా అరుస్తూ ఎవరినైనా బెదిరిస్తూ లేదా దుర్భాషలాడుతూ లేదా అవమానిస్తూ ప్రజల మధ్య అశాంతికి కారణమైతే ఈ సెక్షన్‌ను అమలు చేయాలి. సోఫియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేసినందున ఆమెపై ఈ రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం కొంత మేరకు సమంజసమే. అయితే ఆమెపై భారతీయ శిక్షాస్మతిలోని 505 సెక్షన్‌ కింద కూడా కేసు పెట్టారు.

ప్రజలకు చేటు చేసే ప్రకటనలు ఇచ్చినందుకు ఈ సెక్షన్‌ కింద కేసు పెడతారు. ఇది నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌ అవడం వల్ల సాధారణంగా ఈ సెక్షన్‌ కింద పోలీసులు అరెస్టులు చేస్తారు. ఈ సెక్షన్‌ కింద కూడా తమకు అధికారం ఉందికదా అని అరెస్టులు చేయవద్దని 1994లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి–జోగిందర్‌ కుమార్‌ మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను సూచించింది. ‘అరెస్ట్‌ చేసే అధికారం ఉందికదా అని ఏ పోలీసు అధికారి ఎవరిని అరెస్ట్‌ చేయరాదు. ఎందుకు అరెస్ట్‌ చేయక తప్పలేదో అరెస్ట్‌ చేసిన అధికారి ఆ తర్వాత రుజువు చేసుకోగలగాలి. హత్యలాంటి పెద్ద నేరం చేసినప్పుడు మాత్రమే అరెస్ట్‌ చేయాలి. అరెస్టులు, పోలీసుల కస్టడీ వ్యక్తుల ఆత్మగౌరవానికి, పరువుకు ఎనలేని నష్టం కలిగిస్తాయి. ‘కాగ్నిజబుల్‌ నేరం చేసినా అరెస్ట్‌ చేయరాదు. నిందితుడు చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే అవకాశం ఉన్నప్పుడు, జనం మధ్య తిరగేందుకు అవకాశం ఇస్తే జనానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నప్పుడు, పదే పదే నేరాలకు పాల్పడినప్పుడు అరెస్ట్‌లు చేయవచ్చు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడమే కాకుండా ‘నేషనల్‌ పోలీసు కమిషన్‌’కు ఈ విషయమై ఓ నివేదికను పంపించింది.

సుప్రీంకోర్టు సూచించిన ఈ మార్గదర్శకాల ప్రకారం సోఫియాను పోలీసులు అరెస్ట్‌ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కేసును తక్షణం పరిశీలించిన జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎస్‌. తమిల్‌సెల్వీ యాంత్రికంగా సోఫియాను 15 రోజులు రిమాండ్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో నిందితురాలిని ఎందుకు అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందంటూ పోలీసు అధికారులను నిలదీయాల్సిన న్యాయమూర్తే రిమాండ్‌ ఉత్తర్వులు జారీ చేస్తే చట్టం ఎంత చక్కగా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ నాయకురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు, ఆమె, ఆమె పార్టీ కార్యకర్తలు విమానాశ్రయంలో తమను నానా దుర్భాషలాడారంటూ సోఫియా తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఏ విధంగానూ స్పందించకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలో!

మరిన్ని వార్తలు