భగ్న హృదయాలు 'భగ్గుమంటున్నాయ్‌'!

22 Nov, 2018 03:06 IST|Sakshi

జాతకాలు మార్చగలిగే.. భంగపడిన ఆశావహులు

అన్ని పార్టీల్లో తలనొప్పులు

అన్ని పార్టీల్లో టికెట్ల కేటాయింపు పూర్తయ్యింది. బీ ఫాం దక్కిన అభ్యర్థులు పోటీకి సై అంటుంటే.. దక్కని వారు తిరుగుబాటు బావుటా ఎగురవేసి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో ఇప్పుడు రెబల్స్‌.. అభ్యర్థులను హడలెత్తిస్తున్నారు. కొన్నిచోట్ల వీరు ఓట్లు చీల్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనుంది. ప్రధాన పార్టీల్లో ఇప్పటికీ బుజ్జగింపుల పర్వం నడుస్తోంది. కొందరు దారికి వస్తోంటే.. ఇంకొందరు జెండా మార్చేపనిలో ఉన్నారు. మరికొందరు నేరుగా పోటీకి దిగడం ద్వారా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు. ఇంకా కొందరు పార్టీ ప్రచారంలో ముఖం చాటేస్తున్నారు. మొత్తానికి టికెట్‌ దక్కని వారు అసంతృప్తితో ఉన్నా.. పోటీకి దిగినా కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్థులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. జిల్లాల వారీగా అటువంటి పరిస్థితులు ఉన్న నియోజకవర్గాల విశ్లేషణ...

అన్నా.. మద్దతివ్వు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టికెట్‌   ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి పడాల వెంకటస్వామి అధిష్టానాన్ని కోరారు. అనూహ్యంగా ఇటీవలే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కేఎస్‌ రత్నంకు టికెట్‌ దక్కింది. దీంతో అలకవహించిన వెంకటస్వామి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించారు. అధిష్టానం నచ్చజెప్పడంతో  వెనక్కి తగ్గారు. బుధవారం కేఎస్‌ రత్నం.. వెంకటస్వామి ఇంటికి వచ్చి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ దృశ్యమే ఇది..     
– చేవెళ్ల 

ఆదిలాబాద్‌: అటుఇటు..
- మాజీ మంత్రి జి.వినోద్‌ టీఆర్‌ఎస్‌ నుంచి చెన్నూరు టికెట్‌ కోసం ప్రయత్నించారు. కానీ ఇక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు టికెట్‌ నిరాకరించిన టీఆర్‌ఎస్‌.. ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్‌ను పోటీకి నిలిపింది. వినోద్‌ కాంగ్రెస్‌ నుంచి కూడా టికెట్‌ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. ఓదెలు చేసిన యత్నాలూ ఫలించలేదు
మంచిర్యాల నుంచి టికెట్‌ ఆశించిన అరవిందరెడ్డి (కాంగ్రెస్‌) .. తన ప్రత్యర్థికి టికెట్‌ లభించడంతో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు
టీఆర్‌ఎస్‌ ఎంపీ జి.నగేష్‌ బోథ్‌ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నించారు. టికెట్‌ లభించకపోడంతో.. ఆయన ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. 

కరీంనగర్‌: అసంతృప్తి జోర్‌దార్‌
చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థులను ప్రధాన పార్టీలు చివరి నిమిషంలో ప్రకటించాయి. ఇక్కడి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ చివరి వరకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం వేచి చూసి.. ఆశాభంగమై బీజేపీలో చేరారు
ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి సుద్దాల దేవయ్యకు మొండిచేయి మిగిలింది
మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి (కాంగ్రెస్‌) హుస్నాబాద్‌ టికెట్‌ ఆశించారు. కాని కూటమి లెక్కల్లో ఈ సీటు సీపీఐకి వెళ్లింది
వేములవాడ టికెట్‌ ఆశించిన జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ (టీఆర్‌ఎస్‌)కు నిరుత్సాహమే మిగిలింది
సిరిసిల్లా లేదా కరీంనగర్‌ టికెట్‌ కోసం డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ప్రయత్నించినా.. పని కాలేదు.

నిజామాబాద్‌: ఆశనిరాశ
బాల్కొండ నుంచి టీడీపీ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి.. ఈ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే అనిల్‌ (కాంగ్రెస్‌)కు దక్కడంతో భంగపడ్డారు.  
నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ధన్‌పాల్‌ సూర్యనారాయణ (బీజేపీ)కు దక్కకపోవడంతో.. ఆయన అనుచరులు పార్టీ ఆఫీస్‌లో ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. ఆయన ఎలాగైనా పోటీ చేయాలన్న ఉద్దేశంతో శివసేనలో చేరారు
ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన సుభాష్‌రెడ్డికీ ఆశాభంగమే మిగిలింది. బాన్సువాడలో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మాల్యాద్రిరెడ్డికీ నిరాశే మిగిలింది.  
జుక్కల్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే అరుణతార.. రాకపోవడంతో బీజేపీలో చేరి పోటీ చేస్తున్నారు 

రంగారెడ్డి: కాంగ్రెస్‌లో గడబిడ
రంగారెడ్డి జిల్లాలో భంగపడిన వారి జాబితా కాస్త పెద్దగానే ఉంది. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ ఇబ్రహీంపట్నం టికెట్‌ ఆశించారు. కానీ పొత్తులో ఈ టికెట్‌ టీడీపీకి దక్కింది. టికెట్‌ కోసం తనను రూ.3 కోట్లు లంచం అడిగారంటూ మల్లేష్‌ ఆరోపించినా.. ఆయనపై సస్పెన్షన్‌ వేటుకు రంగం సిద్ధమైందే తప్ప ఆయనకు టికెట్‌ రాలేదు
కాంగ్రెస్‌ నుంచి.. తాండూరు టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, రాజేంద్రనగర్‌లో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి, చేవేళ్లలో వెంకటస్వామి, షాద్‌నగర్‌లో శంకర్‌రావు, ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, శేరిలింగంపల్లిలో భిక్షపతియాదవ్, కూకట్‌పల్లిలో గొట్టిముక్కల వెంగళరావుకు ఆశాభంగం తప్పలేదు. వీరిలో కొందరు నామినేషన్లు దాఖలు చేశారు. వారిని బుజ్జగించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

వరంగల్‌: నిరాశ హోరు
కాంగ్రెస్‌ పార్టీలో.. వరంగల్‌ పశ్చి మ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వర్దన్నపేట నుంచి కొండేటి శ్రీధర్, స్టేషన్‌ ఘనపూర్‌ నుంచి డాక్టర్‌ విజయరామారావు టికెట్లు ఆశించారు. వీరెవరికి రాలేదు.
టీఆర్‌ఎస్‌ నుంచి గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), సత్యవతి రాథోడ్‌ (డోర్నకల్‌), కవిత (మహబూబాబా ద్‌), రాజారపు ప్రతాప్‌ (స్టేషన్‌ ఘనపూర్‌), ప్రదీప్‌రావు, గుండు సుధారాణి, గుడిమెల్ల రవికుమార్‌ (వరంగల్‌ తూర్పు) టికెట్‌ కోసం చేసిన యత్నాలు వృథా అయ్యాయి.
మెదక్‌: అసంతృప్తుల తడాఖా
దుబ్బాక నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి.. ఈ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించడంతో టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోయిన నాగేశ్వరరెడ్డికి కాంగ్రెస్‌ బీ ఫాం ఇచ్చింది
పటాన్‌చెరులో గాలి అనిల్‌కుమార్, సపాన్‌దేవ్‌ కాంగ్రెస్‌ టికెట్లు ఆశిస్తూ నామినేషన్లు కూడా వేశారు. కానీ, టికెట్‌ కాటా శ్రీనివాసగౌడ్‌కు దక్కింది. ఇప్పుడు వీరిద్దరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరు ఏ నిర్ణయం తీసుకుంటారనేది రెండు మూడు రోజుల్లో తేలనుంది
నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన భంగపడిన సంజీవరెడ్డి.. బీజేపీలో చేరి టికెట్‌ తెచ్చుకున్నారు. 

పాలమూరు: ఇంటిపోరు
మక్తల్‌ టికెట్‌ ఆశించిన టీఆర్‌ఎస్‌ నాయకుడు జలంధర్‌రెడ్డి.. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగారు
మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌లో ఉన్న నారాయణపేట నాయకుడు శివకుమార్‌రెడ్డి.. కాంగ్రెస్‌ టికెట్‌ వస్తుందన్న ధీమాతో ఆ పార్టీలో చేరిపోయారు. తీరా టికెట్‌ దక్కకపోయే సరికి కాంగ్రెస్‌ను వీడారు. బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు
మహబూబ్‌నగర్‌ టికెట్‌ కూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు ఇచ్చారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన సురేందర్‌రెడ్డి ఎన్సీపీ నుంచి పోటీకి దిగారు. ఇంటి పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా బరిలో ఉన్నారు
దేవరకద్రలో కాంగ్రెస్‌ నాయకుడు మధుసూదన్‌రెడ్డి టికెట్‌ దక్కక.. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. 

నల్లగొండ: అందరికీ బెంగ
దేవరకొండ టికెట్‌ ఆశించిన రేవంత్‌రెడ్డి అనుచరుడు బిల్యానాయక్‌ (కాంగ్రెస్‌)కు ఆశాభంగం తప్పలేదు. ఆయన రేవంత్‌రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటారని సమాచారం
నాగార్జునసాగర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన ఎంసీ కోటిరెడ్డికి ఈసారీ నిరాశే మిగిలింది. ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్నారు
మిర్యాలగూడ టికెట్‌ ఆశించిన ప్రతిపక్షనేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డికీ ఆశాభంగం తప్పలేదు. టికెట్‌ ఆర్‌.కృష్ణయ్యకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అమరేందర్‌రెడ్డి మరో ఐదేళ్ల వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి.
కోదాడ టికెట్‌ను టీడీపీ నుంచి ఒకరోజు ముందు పార్టీలో చేరిన మల్లయ్యయాదవ్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించడంతో అప్పటి వరకు టికెట్‌ కోసం ఎదురుచూసిన శశిధర్‌రెడ్డి, చందర్‌రావు కంగుతిన్నారు. ఇంకా షాక్‌ నుంచి కోలుకోని వీరు మల్లయ్యయాదవ్‌కు ఏ మేరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకమే
సూర్యాపేట నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన పటేల్‌ రమేష్‌రెడ్డి.. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. తుంగతుర్తిలో డాక్టర్‌ రవి ఆశ పెట్టుకున్నా.. టికెట్‌ దక్కలేదు. నకిరేకల్‌లో ప్రసన్నరాజుదీ అదే పరిస్థితి
మునుగోడు టికెట్‌ ఆశించిన పాల్వాయి స్రవంతి.. ప్రస్తుతం ఇక్కడి నుంచి పోటీలో ఉన్న రాజగోపాల్‌రెడ్డికి ఏ మేరకు మద్దతునిస్తారో చూడాలి.

ఖమ్మం..గుమ్మంలో అసమ్మతి 
ఇల్లెందు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య.. స్వతంత్రునిగా రంగంలో ఉన్నారు. 
వైరాలో  రాములునాయక్‌  (కాంగ్రెస్‌) స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 
కొత్తగూడెంలో ఎడవల్లి కృష్ణ (కాంగ్రెస్‌)కు మళ్లీ మొండిచే యే మిగిలింది. వనమా వెంకటేశ్వరరావును ఓడించే ఉద్దేశంతో ఆయన బీఎల్‌ఎఫ్‌ తరఫున బరికి దిగారు. 

హైదరాబాద్‌: టెన్షన్‌
సనత్‌నగర్‌ నుంచి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కలేదు. ఆయన స్థానంలో కూటమి అభ్యర్థికి టికెట్‌ ఇచ్చారు. ఆయన ప్రస్తుతం మనస్థాపంతో ఉన్నారు.
సికింద్రాబాద్‌ టికెట్‌ ఆశించిన మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డికీ నిరాశ మిగిలింది.  
తనకు లేదా అల్లుడికి చివరి నిమిషం వరకు ముషీరాబాద్‌ టికెట్‌ కోసం ప్రయత్నించిన నాయిని నర్సింహారెడ్డి.. చివరకు తన చేతుల మీదుగానే ముఠా గోపాల్‌కు బీఫాం ఇచ్చారు. ఈయన ఏ మేరకు గోపాల్‌కు సహకరిస్తారనేది చూడాల్సిందే.
.:: కె.శ్రీకాంత్‌రావు

మరిన్ని వార్తలు