‘వీడియో కాన్ఫరెన్స్‌లతో మాకు ఒరిగిందేమీ లేదు’

12 May, 2020 19:55 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా తమ రాష్ట్రానికి ఒరిగిందేమీలేదని విమర్శించారు. ప్రధానితో చర్చించిన తర్వాత తాము ఖాళీ చేతులతో వెనుదిరుగాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్ అమలుకు సరైన ప్రణాళిక రూపొందించడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు.  

‘ప్రధానితో సమావేశంలో నేను పలు అంశాలను ప్రస్తావించాను. కానీ ప్రతిసారి మేము ఖాళీ చేతులతోనే వెనుదిరుగుతున్నామని నేను కచ్చితంగా చెప్తాను. కరోనాను నుంచి త్వరలోనే బయటపడతామని  అనుకోవద్దన్నారు. దీనిని ఎదుర్కొవడానికి మూడు నెలల ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఉంది’ అని మమత పేర్కొన్నారు. మరోవైపు కేం‍ద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ సడలింపులను మమత సర్కార్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం దేశంలోని ప్రధాన పట్టణాలకు రైల్వే సర్వీసులు నడపాలని తీసుకున్న నిర్ణయం లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడిచేలా ఉందని ఆమె మండిపడ్డారు. అలాగే రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందనే భావనలో మమత ఉన్నట్టుగా తెలుస్తోంది. (చదవండి : మూడు కేటగిరీలుగా రెడ్‌ జోన్లు‌: దీదీ)

కాగా, కరోనా విషయంలో బీజేపీ , మమత సర్కార్‌కు మధ్య విమర్శలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులకు సంబంధించి మమత ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపెడుతుందని బెంగాల్‌ బీజేపీ నేతలు ఆరోపించడంతో.. కేంద్రం అక్కడికి ప్రత్యేక బృందాలను పంపింది. ఈ క్రమంలో బీజేపీ, టీఎంసీల మధ్య పరస్పరం విమర్శలు చోటుచేసుకున్నాయి.

మరిన్ని వార్తలు