'సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదు.. అందుకే'

23 Jun, 2020 14:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి వివరిద్దామంటే ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదు.. అందుకే లేఖలు రాయాలని నిర్ణయించినట్లు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ వర్దంతి సందర్భంగా లక్ష్మణ్‌ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' కశ్మీర్‌ కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ క్లిష్టమైన ఆర్టికల్‌ 370 రద్దు చేసి కశ్మీర్‌ను దేశంలో విలీనం చేశారు. అలాగే కరోనా మహమ్మారిని ప్రధాని మోదీ విజయవంతంగా ఎదుర్కొని ముందుకెళ్తున్నారు. (‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’)

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక నియంతలా పాలిస్తున్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో హైదరాబాద్‌ అస్తవ్యస్తంగా మారింది. విపక్ష పార్టీలు చెప్పే సూచనలను పెడచెవిన పెడుతున్నారు. కరోనా గురించి మాట్లాడితే అధికార పక్షం ఎదురు దాడి చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆఖరికి శవాల విషయం కూడా గందరగోళం నెలకొంది. ఈ విషయమై నేను సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తాను. దీన్ని ఒక విమర్శలా కాకుండా.. మంచి పద్దతిలో స్వీకరించాలి. ప్రభుత్వం చేస్తున్న కరోనా పరీక్షల్లో ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వస్తోంది. లాక్డౌన్ సమయంలోనే ఎక్కువ టెస్టులు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది' అంటూ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు