‘50 కోట్లు, మంత్రి పదవి ఆఫర్‌ చేశారు’

28 May, 2019 10:33 IST|Sakshi

మధ్య ప్రదేశ్‌ బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి సంచలన వ్యాఖ్యలు

భోపాల్‌: తమ పార్టీలో చేరితే రూ.50 కోట్లతో పాటు మంత్రి పదవినీ కట్టబెడుతామని బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తున్నదని మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరమని ఆ నేతలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇస్తున్నారని ఆమె వెల్లడించారు. డబ్బుకు ఆశపడ్డ వాళ్లు బీజేపీ ప్రలోభాలకు లొంగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. తాను మాత్రం కమల్‌నాథ్‌ ప్రభుత్వానికే మద్దతు ఇస్తానని, బీజేపీ గూటికి చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  ‘‘మంత్రి పదవితో పాటు డబ్బు ఇస్తామని నాకు ఫోన్ కాల్ వచ్చింది. కానీ, నేను తిరస్కరించా. వారి నెంబర్స్‌ బ్లాక్‌ చేశాను’’ అని అన్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులను ఎరగా చూపుతూ బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న తెలిసిందే.

బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతుతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఒక్కసీటు మినహా మిగతా వాటన్నింటినీ బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా రాంబాయి సంచలన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మధ్యప్రదేశ్‌, కర్ణాటక ప్రభుత్వాలను అస్థిరపరిచి ప్రభుత్వాలను ఏర్పాటుచేయాలని బీజేపీ ఆపరేషన్‌ కమల్‌కు శ్రీకారం చుడుతోన్న విషయం తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రల్లో రాజకీయం ఉత్కంఠంగా మారింది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గోడ దూసుతారోనని పార్టీ నేతలకు భయం పట్టుకుంది. 

మరిన్ని వార్తలు