కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు!

17 Nov, 2023 08:07 IST|Sakshi

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో డెబ్బై స్థానాలకు నేడు నిర్ణయాత్మక రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందులో కాంగ్రెస్, బీజేపీలతో పాటు అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, మరికొన్ని చిన్న పార్టీలు పోటీలో ఉన్నాయి. గిరిజనులు, వెనకబడిన తరగతులనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్న చిన్నపార్టీలు ఈ సారి కీలకంగా మారనున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

బిలాస్‌పూర్ ప్రాంతంలో ఈ సారి పోరు హోరాహోరీగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో 25 నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలో ఇవి దాదాపు మూడో వంతు. 2018 ఎన్నికలలో ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ ఈ సారి ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోవచ్చు. ఇక్కడి ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ కూడా సరైన పనితీరు కనబర్చలేదని నిపుణులు భావిస్తున్నారు. 2018లో ఈ డివిజన్‌లో కాంగ్రెస్ 12, బీజేపీ ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ రెండు సీట్లు గెలుచుకోగా, అజిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జోగి) మూడు సీట్లు గెలుచుకుంది.

2018 కంటే ఎక్కువగా దాదాపు 75 సీట్లను కాంగ్రెస్ ఈ సారి గెలుస్తుందని భఘేల్ ఇప్పటికే ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరినీ ఆదుకున్నామని తెలిపిన భఘేల్‌... అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో అందరికీ ప్రయోజనం చేకూరిందని, అవన్నీ ఓట్లుగా మారుతాయని ధీమాతో ఉన్నారు. కానీ సాంప్రదాయంగా కాంగ్రెస్‌కు వచ్చే గిరిజనులు, వెనకబడిన తరగతుల ఓట్లను ఈసారి చిన్న పార్టీలు చీల్చనున్నాయి. ఈ మార్పుతో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు ఈ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయని అంచనాలు చెబుతున్నాయి.  

 2018లో రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 68 సీట్లతో కాంగ్రెస్ విజయాన్ని కైవసం చేసుకుంది. 2013 జిరామ్ ఘాటి మావోయిస్ట్ దాడి తర్వాత రాష్ట్రంలో పార్టీకి కొత్త ఉత్సాహం తెచ్చిన బఘేల్.. ప్రధాన నేతగా ఎదిగారు. సీఎం కుర్చీ కోసం మరో ముగ్గురు నేతలు పోటీలో ఉన్నా కేంద్ర అధిష్ఠానం ఆయనకే పగ్గాలు అప్పగించింది.

ఈసారి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రధాని మోదీనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రెండింటిలోను వెనుకబడిన తరగతులు, గిరిజనులపై బీజేపీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. గిరిజనుల ఓట్లు సంప్రదాయంగా కాంగ్రెస్‌కే పోయేవి. కానీ ఈసారి ఆ విధానం మారేలా కనిపిస్తోంది. చిన్న పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. 

జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్-జోగి (JCC), హమర్ రాజ్ పార్టీ, మాజీ కాంగ్రెస్ నాయకుడు అరవింద్ నేతమ్ నేతృత్వంలోని సర్వ్ ఆదివాసీ సమాజ్, ఆప్‌, ఆయా స్థానాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన అభ్యర్థులను నిలబెట్టాయి. వారు ఓట్లలో కొంత భాగాన్ని అయినా ప్రభావం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గిరిజనులు, వెనకబడిన వర్గాల ఓట‍్ల చీలిక ఒకింత బీజేపీకే కలిసి వచ్చేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇదీ చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌

మరిన్ని వార్తలు