‘కీ’ రోల్‌ కోసం కమలం వ్యూహం! 

5 Dec, 2018 02:58 IST|Sakshi

రాష్ట్రంలో హంగ్‌ వస్తుందన్న ఆలోచనల్లో బీజేపీ

కనీసం 15 స్థానాల్లో గెలిచి సత్తా చాటేందుకు ప్రణాళికలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో హంగ్‌ వస్తుందన్న ఆలోచనల్లో ఉన్న బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఇలా దాదాపు 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లతో రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేస్తోంది. కనీసం 15 స్థానాలను గెలిచి ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలని భావిస్తున్న బీజేపీ 13 వరకు స్థానాల్లో గట్టి పోటీనిస్తోంది. టీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌ నిత్యం సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా, ఇటు బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ నేతలతో పాటు ప్రధాని మోదీ సైతం రంగంలోకి దిగారు. అటు కాంగ్రెస్‌ ఇటు టీఆర్‌ఎస్‌లను బీజేపీ ప్రచారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. (కమలానిదే కీలకపాత్ర ! )

ఇప్పటికే ఐదు స్థానాల్లో గెలుపుపై ధీమాతో ఉన్న బీజేపీ మరో ఏడెనిమిది స్థానాల్లోనూ బాగా పుంజుకుంది. వాటిల్లో గెలుపు లేదా రెండో స్థానంలో నిలిచే పరిస్థితి నెలకొంది. అంబర్‌పేట్, గోషామహల్, ఖైరతాబాద్, ముషీరాబాద్, ఉప్పల్‌ సిట్టింగ్‌ స్థానాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్‌ అర్బన్, కల్వకుర్తి, సూర్యాపేట, మల్కాజ్‌గిరి, జుక్కల్, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని ఇతర పార్టీల నేతలు గందరగోళంలో పడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు పార్టీకి బలంగా ఉన్న ఓట్లు చీలితే ఏ పార్టీ వైపునకు వెళ్తాయన్న దానిపై అభ్యర్థులు అంచనాలు వేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 

పార్టీ హేమాహేమీలంతా రాష్ట్రంలోనే.. 
గతంలో ఎప్పుడూ లేనంతగా బీజేపీ జాతీయ నేతలు, ఆ పార్టీ హేమాహేమీలంతా రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఏర్పడిన టీడీపీని తన అవసరాలకు ఏపీ సీఎం చంద్రబాబు రాహుల్‌గాంధీకి తాకట్టు పెట్టారంటూ.. ఇటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సీఎంలు, కీలకనేతలు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, నితిన్‌ గడ్కరీలతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు గత 4 రోజుల నుంచి రోజుకు 20 నుంచి 25 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. 

ఎంఐఎంకు చెక్‌ పెట్టేందుకు అస్త్రశస్త్రాలు 
ప్రచారంలో బీజేపీ నేతలు అన్ని రకాల అస్త్రశస్త్రాలను వినియోగిస్తున్నారు. రజాకార్ల వారసులంటూ ఎంఐఎంను తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు ఎంఐఎం ప్రభావిత నియోజకవర్గాల్లోనూ బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్న భావనను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, స్వామి పరిపూర్ణానందలతో బహిరంగ సభలను ఆ పార్టీ విస్తృతంగా నిర్వహిస్తోంది. ఈనెల 5న ముథోల్, కరీంనగర్, బోధన్‌లోనూ యోగి ప్రచారం నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలోనూ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తద్వారా బీజేపీ అభ్యర్థులు ముస్లింల ఓట్లు రాబట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పాతబస్తీతోపాటు హైదరాబాద్‌లో పలు ప్రాం తాలు, జిల్లాల్లోని ఎంఐఎం ప్రభావిత నియోజకవర్గాల్లోనూ వారి సభలను నిర్వహిస్తోంది.  

>
మరిన్ని వార్తలు