ఆ చరిత్ర పటేల్‌కే దక్కుతుంది : మీనాక్షి

9 Nov, 2018 15:55 IST|Sakshi
మీనాక్షి లేఖి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో కలిసి పోయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఆరోపించారు. సొంతపార్టీకి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియలు కూడా సరిగ్గా చేయని పార్టీ కాంగ్రెస్‌ అని ఆమె వ్యాఖ్యానించారు. నగరంలోని ముషీరాబాద్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ యువ భేరీలో పాల్గొన్న మీనాక్షి మాట్లాడుతూ.. కొన్ని కుటుంబాల కలయిక మహాకూటమని వర్ణించారు. చాయ్‌ అమ్మిన మామూలు మనుషులను ప్రధాని చేసిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. రైతులకు భీమా, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి గొప్ప పథకాలను మోదీ ప్రభుత్వం అమలుచేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర పథకాలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.

హైదరాబాద్‌ ప్రాంతాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన ఘనత సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌కే దక్కుతుందని ఆమె గుర్తుచేశారు. దక్షిణ భారతంలో తినడానికి తిండి కూడా దొరకదని పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. బీజేపీ మద్దతు తెలపడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. సచివాలయానికి రాకుండా పాలిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరని.. కేవలం బిడ్డను ఎంపీ చేసి కుటుంబ పాలన చేస్తున్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరు చూసి టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు