మహారాష్ట్రలో బీజేపీ విజయకేతనం

12 Apr, 2018 17:15 IST|Sakshi
భార్య సాధనా మహాజన్‌తో గిరీశ్‌ మహాజన్‌

సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని జామ్నర్ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 25 కార్పొరేషన్లలోనూ అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రాష్ట్ర జలవనరులు, వైద్యశాఖ మంత్రి గిరీశ్‌ మహాజన్‌ భార్య సాధనా మహాజన్‌ ఎన్సీపీ అభ్యర్థి అంజలి పవార్‌పై 8400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గిరీశ్‌ మహాజన్‌.. అన్నాహజారే దీక్ష, మహా రైతుల ర్యాలీ సమయంలో ఏర్పడిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఫడ్నవిస్‌కు సలహాలు ఇవ్వడం ద్వారా ట్రబుల్‌ షూటర్‌గా పేరు పొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన భార్య గెలుపొందడం ద్వారా మహా రాజకీయాల్లో పట్టు సాధించడం ఆయనకు మరింత సులభంగా మారింది. సొంత పార్టీలోనే శత్రువుగా భావించే ఏక్‌నాథ్​ ఖడ్సేపై పై చేయి సాధించినట్టయింది.

ఇది ప్రజా విజయం : గిరీశ్‌ మహాజన్‌
జామ్నర్ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయంపై గిరీశ్‌ మాట్లాడుతూ.. జామ్నర్లో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఎన్సీపీ నాయకుల కుల రాజకీయాలు ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.

ఓటుకు 5 వేల రూపాయలు ఇచ్చారు : ఎన్సీపీ
మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ డబ్బు వెదజల్లిందని ఎన్సీపీ నాయకులు ఆరోపించారు. గిరీశ్‌ మహాజన్‌ ఇంటింటికీ తిరిగి ఓటుకు 5 వేల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు