పెట్టుబడులు తక్కువ.. దుబారా ఎక్కువ: బొత్స

28 Oct, 2017 01:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వస్తాయంటూ సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ బూటక మేనని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనలవల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల కంటే వీటి కోసం పెట్టిన ప్రభుత్వ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని బొత్స అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరిపాలనను గాలికొదిలేసి విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలపైనే బాబు దృష్టి పెట్టారు.

2014 నుంచి రెండు నెలలకొకసారి చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. తాజాగా అమెరికా, దుబాయ్, లండన్‌లో పర్యటించారు. గత మూడున్నరేళ్లలో విదేశీ పర్యటనల ద్వారా ఎన్ని పెట్టుబడులు తెచ్చారో, ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయించారో శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని బొత్స డిమాండ్‌ చేశారు. సీబీఐ మాజీ డైరెక్టర్‌ కేసుపై జాతీయ పత్రికలు వాస్తవాలు రాస్తుంటే కొన్ని ప్రాంతీయ పత్రికలు మాత్రం రహస్య ఎజెండాతో ప్రతిపక్షానికి చెందిన నాయకుల వ్యక్తిగత జీవితాలను కించపరుస్తూ వార్తలిస్తున్నాయని బొత్స దుయ్యబట్టారు.  ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన చార్జిషీట్‌లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉన్నా ఈ పత్రికలు ఒక్క కథనమైనా రాశాయా? అని బొత్స ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు