అనుచితంగా ప్రవర్తిస్తే ‘పోలింగ్‌’ నుంచి గెంటివేత!

4 Nov, 2018 02:14 IST|Sakshi

స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌ సమయంలో పోలింగ్‌ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించినా లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైనా వారిని ప్రిసైడింగ్‌ అధికారి బయటకు పంపవచ్చు అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 132 కింద ఈ మేరకు ప్రిసైడింగ్‌ అధికారికి అధికారాలున్నాయని పేర్కొంది.

మద్యం సేవించిన లేదా మాదక ద్రవ్యాలను వినియోగించిన వ్యక్తులను పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించకుండా నిలువరించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌ రాసిన లేఖకు స్పందిస్తూ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది.

కాగా, మద్యం సేవించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని సీఈఓ రజత్‌కుమార్‌ పలు సందర్భాల్లో వివరణ ఇచ్చారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సహాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
 

మరిన్ని వార్తలు