సీట్ల కేటాయింపు మింగుడుపడటం లేదు : చాడ

9 Nov, 2018 15:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీట్ల కేటాయింపు వ్యవహారం అంతా తేలికగా ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. అటు కూటమి నేతలు ఈ సీట్ల పంపిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలకు 26 సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. సీపీఐ నాయకులు 9 సీట్లను కోరుకుంటుండగా.. కేవలం 3 స్థానాలను మాత్రమే వారికి కేటాయించింది. దాంతో ఈ విషయం పట్ల సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం సీపీఐ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది. మరోసారి కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. తాము అడిగిన 9 స్థానాల్లో.. 5 స్థానాలు తప్పక ఇవ్వాల్సిందిగా సీపీఐ డిమాండ్‌ చేస్తోంది. సీట్ల వ్యవహరాన్ని జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం మరోసారి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సీపీఐ కోరిన 9 స్థానాలు ఇవే...
హుస్నాబాద్‌, కొత్తగూడెం, వైరా, మంచిర్యాల, మునుగోడు, దేవరకొండ, బెల్లంపల్లి, పినపాక ఆలేరు స్థానాలను తమకు కేటాయించాల్సిందిగా సీపీఐ కోరింది. కానీ కాంగ్రెస్‌ మాత్రం బెల్లంపల్లి, హుస్నాబాద్‌, వైరా స్థానాలను సీపీఐకి కేటాయించింది. ఈ క్రమంలో సీపీఐ నాయకులు ఈ 9 స్థానాల్లో కనీసం 5 స్థానాలను మాత్రం ఖచ్చితంగా తమకు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేస్తోంది.

ఈ ఐదు స్థానాల్లో హుస్నాబాద్‌, కొత్తగూడెం స్థానాలు తప్పకుండా ఉండాలని తీర్మానించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ అంశాలపై చర్చించేందుకు ఈ రోజు సాయంత్ర 6 గంటలకు మరోసారి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

సీట్ల ప్రకటన మింగుడుపడటం లేదు : చాడ
మహాకూటమి సీట్ల పంపకం గురించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. కార్యవర్గ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపామన్నారు. కూటమిలోని మిగతా సభ్యలైన టీజేఎస్‌ అధ్యక్షుడు కోదంరాం, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, కాంగ్రెస్‌ నేత జానారెడ్డిలను కలుస్తామని తెలిపారు. సీట్ల సర్దుబాటు పరిణామాలపై వాళ్లతో చర్చిస్తామని చెప్పారు. 9 సీట్లలో.. 5 సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేవలం మూడు సీట్లు మాత్రమే ప్రకటించడం మింగుడుపటం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటలకు మరోసారి కార్యవర్గ సమావేశం అనంతరం కూటమిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు