డబ్బు తీసుకుని ఓట్లేస్తున్నారు

12 Feb, 2020 03:58 IST|Sakshi

పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రజలపై చంద్రబాబు ఆగ్రహం 

ప్రజాప్రతినిధులు మాత్రం నిజాయతీగా ఉండాలంటున్నారు

సాక్షి, అమరావతి: వెయ్యో, రెండు వేల రూపాయలో ఇస్తే లొంగిపోయి ప్రజలు ఓట్లు వేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. డబ్బులు ఇస్తే అభివృద్ధిని మరచిపోయి ఓట్లు వేసేస్తున్నారని చెప్పారు. విజయవాడ శివారు కానూరులో మంగళవారం జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం నిజాయతీగా ఉండాలని వారు కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై అన్ని స్థాయిల్లో చర్చ జరగాల్సి ఉందన్నారు. మహిళల సారథ్యంలో అమరావతి ఉద్యమం నడుస్తోందని తెలిపారు. విశాఖలో 33 వేల ఎకరాలను వైఎస్సార్‌సీపీ నాయకులు ఆక్రమించారని ఆరోపించారు. కరెంట్‌ చార్జీలు పెంచి రూ. 1,300 కోట్ల భారం ప్రజలపై మోపారని విమర్శించారు. తొమ్మిది నెలల్లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి పోయాయన్నారు. 18 లక్షల రేషన్‌ కార్డులు తొలగించారని ఆరోపించారు.  

మీడియా షో తగ్గించాలి: అయ్యన్న, కరణం 
సీనియర్‌ నాయకులు అయ్యన్నపాత్రుడు, కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తీరును తప్పుబట్టారు. కొందరు నాయకులు మీడియా కోసమే కార్యక్రమాలు చేస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తున్నారని, ఇది సరికాదన్నారు. నాయకులు షో చేయడం మానేసి పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలని సూచించారు. నాయకులు ప్రెస్‌మీట్లు తగ్గించి పని మీద దృష్టి పెట్టాలని సూచించారు. కాగా, ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. 175 నియోజకవర్గాల్లో 45 రోజులు ఈ యాత్రలు చేయాలని చంద్రబాబు చెప్పారు.  

మరిన్ని వార్తలు