‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’

18 Sep, 2019 13:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీలో కోడెల శివప్రసాదరావును చంద్రబాబు నాయుడు తీవ్ర అవమానాలకు గురిచేశారని బీజేపీ అధికార ప్రతినిధి కేవీ లక్ష్మీపతి రాజా ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల బీజేపీలోకి రావాలనుకున్న మాట వాస్తవమని స్పష్టం చేశారు. టీడీపీలో చంద్రబాబు అవమానాలకు గురిచేస్తున్నారని బీజేపీ నేతలతో కోడెల చెప్పారని, తనను కలవడానికి కనీసం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన చెందినట్టు వెల్లడించారు.

అమిత్ షాను కలిసేందుకు ఏర్పాటు చేయాలని కోడెల బీజేపీ నాయకులను కోరారని, కోడెల బీజేపీలో చేరికపై పార్టీలో చర్చ కూడా జరిగిందన్నారు. కోడెల చనిపోయిన తర్వాత చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని, గతంలో కోడెల ఆత్మహత్య ప్రయత్నం చేస్తే చంద్రబాబు కనీసం పరమర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదంలో కోడెలను వర్ల రామయ్యతో చంద్రబాబు తిట్టించారని ఆరోపించారు. శవ రాజకీయాలతో కోడెల ప్రతిష్ఠను మరింత దిగజార్చవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. కోడెల శివప్రసాదరావు ఉదంతాన్ని చూసైనా మిగిలిన టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వదలి బయటకు రావాలని లక్ష్మీపతి రాజా అన్నారు.

కోడెల మరణంపై అనుమానాలు: రఘురామ్‌
టీడీపీలో కోడెల శివప్రసాదరావు అభద్రతా భావానికి గురయ్యారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురామ్‌ పేర్కొన్నారు. కష్టకాలంలో కోడెలకు చంద్రబాబు అండగా నిలబడలేదని, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆయనను వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. జీవితాంతం పార్టీ కోసం కష్టపడితే తనను చంద్రబాబు కాపాడలేదని కోడెల అన్నట్టు వెల్లడించారు. కోడెల మరణంపై అనేక అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సంబంధిత కథనాలు..

బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

ఒక మరణం.. అనేక అనుమానాలు

కోడెల మృతికి చంద్రబాబే కారణం 

గ్రూపులు కట్టి వేధించారు..

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు