జగన్‌పై వాడింది చిన్న కత్తి.. అయింది చిన్న గాయం: చంద్రబాబు

27 Oct, 2018 18:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయా? ఈ ఘటనపై ముఖ్యమంత్రి, డీజీపీలు స్పందించిన తీరు ఇప్పటికే దర్యాప్తును తీవ్ర ప్రభావితం చేసే విధంగా ఉండగా, ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి మొత్తం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ వెళ్లి అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు ఆసాంతం అలాగే కొనసాగింది. జగన్‌పై విమానాశ్రయంలో దాడి జరిగితే మమ్మల్నెందుకు నిందిస్తారంటూ కేసును పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో కేంద్రం విఫలమైతే మాపై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. (ఢిల్లీలో చంద్రబాబు హైడ్రామా)

శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు, ఎవరు అడక్కుండానే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం సంఘటన గురించి చంద్రబాబు మూడుసార్లు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తన బాధ్యతను విస్మరించి కేసు విచారణ, దర్యాప్తును తీవ్ర ప్రభావితం చేసే విధంగా మరోసారి తన సహజ ధోరణిని బయటపెట్టుకున్నారు. జగన్‌మోహన్ రెడ్డిపై దాడి ఘటనను మీడియా సమావేశంలో ఆయనే ప్రస్తావిస్తూ దాడికి వాడింది చిన్న కత్తి అని అంటూ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను చంద్రబాబు తేలికగా చెప్పారు. అలాగే జగన్‌కు అయింది చిన్న గాయమేనన్నారు. ‘వాడింది చిన్న కత్తి... అయింది చిన్న గాయం... జరిగింది విమానాశ్రయం... విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంది... దీనిపై నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ’ ప్రశ్నించారు. దాడి జరిగిన తర్వాత జగన్ ఎందుకు హైదరాబాద్ వెళ్లిపోయారు? హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారని చెప్పారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర డీజీపీకి గవర్నర్ ఫోన్ చేసి విషయాలను అడగటమేమిటని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. పైగా గవర్నర్ ఢిల్లీకి వచ్చి కేంద్రానికి నివేదిక అందిస్తారా? దీనిపై బీజేపీ నేతలు మాపై విమర్శలు చేస్తారా? అంటూ మొత్తం హత్యాయత్నం ఘటనను వక్రీకరించే ప్రయత్నం చేశారు.

జనవరి ఒకటిన ఫ్లెక్సీ వేశారా?
హత్యయత్నానికి పాల్పడిన యువకుడు జగన్ అభిమానే అని చెప్పడానికి చంద్రబాబు ఈ సందర్భంగా మరోసారి ప్రయత్నం చేశారు. దాడి చేసిన వ్యక్తి జగన్ పక్కపక్కనే ఉన్నట్టు ఒక ఫ్లెక్సీ సృష్టించి అసలు దోషులకు పట్టుకోకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్న ముఖ్యమంత్రి ఫ్లెక్సీలో లేని విషయాన్ని ఈరోజు ఢిల్లీలో వెల్లడించడం గమనార్హం. ఆ ఫ్లెక్సీ జనవరి ఒకటవ తేదీన వేశారని చంద్రబాబు చెప్పారు. జనవరి ఒకటిన వేశారన్న విషయం ఆయన ఒక్కరికే ఎలా తెలిసిందో చెప్పలేదు. జనవరి ఒకటని ఆ ఫ్లెక్సీమీద ఎక్కడా లేకపోగా, ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఆ మాట చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

గరుడ విషయాన్ని శివాజీ చెబుతాడా?
వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడిన చంద్రబాబు మరో ముందడుగు వేసి ఆపరేషన్ గరుడలో చెప్పినట్టే జరుగుతోందని అన్నారు. అయితే ఆపరేషన్ గరుడ అంశంపై విచారణ జరిపించకపోవడంపై సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆపరేషన్ గరుడ గురించి తొలిసారి శివాజీ ప్రకటించినప్పుడు దానిపై విచారణ జరిపించాలని అన్ని పక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబే ఆపరేషన్ గరుడ అంశాన్ని ప్రస్తావించారు. సినీనటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ ప్రకారమే జరుగుతున్నాయని, ఏపీలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి తద్వారా జోక్యం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆపరేషన్ గరుడ అంశాన్ని ఒక విలేకరి లేవనెత్తుతూ, అధికారంలో ఉన్న మీరు ఎందుకు ఆ విషయంపై దర్యాప్తు జరిపించలేదని ప్రశ్నించారు. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం విస్మయపరుస్తోంది. "మీకు ఏదైనా సమాచారం తెలిసినప్పుడు అడిగితే సోర్స్ చెప్పనంటావ్ కదా... !" అంటూ ఆపరేషన్ గరుడ విషయంలో శివాజీని విచారణ జరపాల్సిన అవసరం లేదన్నట్టు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆ వెంటనే నాలుక కరుచుకుని లీగల్‌గా చేయాల్సింది చేస్తామంటూ దాటవేశారు.

మరిన్ని వార్తలు