జనవరి 2లోగా ఏర్పాట్లు పూర్తి చేయండి 

19 Dec, 2018 01:44 IST|Sakshi

పంచాయతీ ఎన్నికలపై అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశాలు  

జిల్లా కలెక్టర్లు, డీపీవోలతో ఏర్పాట్లపై సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జనవరి 2వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఆ తర్వాత ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుంది. రెండు లేదా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) పరిశీలిస్తోంది. హైకోర్టు విధించిన గడువు జనవరి 10లోపే ఎన్నికలు నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బి.నాగిరెడ్డి, కార్యదర్శి అశోక్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జనవరి 2లోగా పూర్తి చేయాలని అధికారులను నాగిరెడ్డి ఆదేశించారు.

ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల నేపథ్యంలో స్థానచలనం పొందిన పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, సిబ్బందిని తిరిగి పాత స్థానాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 20లోగా రిటర్నింగ్‌ అధికారులు, 27లోగా పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల వారీగా ప్రచురించిన జాబితాలోని కొత్త ఓటర్లకు సైతం పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన అసెంబ్లీ నియోజకవర్గాల కొత్త ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా విభజించి పంచాయతీ ఎన్నికలకు వినియోగించాలని కోరారు. కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన నేపథ్యంలో పెరగనున్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు బ్యాలెట్‌ పేపర్లను ముద్రించాలని కోరారు. ఏదేమైనా వచ్చే నెల 2 నాటికి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు