వారిద్దరి వల్లే జిల్లా నాశనమైంది.. శ్రీనివాస్‌ గౌడ్‌ సంచలన ఆరోపణలు

10 Oct, 2023 13:08 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్‌ వేసిన పిటిషన్‌ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. కాగా, కోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్బంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ధర్మం గెలిచింది. గతంలో మంత్రులుగా చెలామని అయ్యి ఈ రాష్ట్రానికి ఏమీ చేయని వాళ్లు పనిచేసే వాళ్లను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే ఇలాంటి కేసులు వేశారు. బీసీలతోనే బీసీ నాయకత్వాన్ని బలహీన పరుచాలనే దుర్బుద్ధితో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ ఇద్దరు నన్ను ఇబ్బందుల పాలు చేయాలనే తలంపుతో ఈ చర్యలకు తెరలేపారు. గతంలో ఈ వ్యక్తుల వల్లే జిల్లా సర్వనాశనం అయ్యింది. ఈరోజు కుల, మతాలకు అతీతంగా అందరికీ అండగా నిలుస్తూ అభివృద్ధిలో జిల్లాను నడుపుతుంటే చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. 

తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లకు పుట్టగతులు లేకుండా పోతాయని వాళ్ళ బంధువులే మాతో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచాలన్నదే మా అభిమతం. ఇప్పటికైనా మారండి, ప్రజా క్షేత్రంలోకి రండి అంతే కానీ కేసులు వేసి పైశాచిక ఆనందం పొందడం మానుకోండి. ప్రజలే నాకు దేవుళ్లు, ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆయన ఆశీస్సులతో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తాం. నాకు అండగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు బిగ్‌ రిలీఫ్‌..


 

మరిన్ని వార్తలు