తిరుగుబాటు నేతలపై కాంగ్రెస్‌ వేటు 

25 Nov, 2018 01:49 IST|Sakshi

24 మంది ఆరేళ్లపాటు సస్పెన్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆరేళ్ల పాటు సస్పెండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సస్పెన్షన్‌ గురైన నేతల జాబితాను క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ కోదండరెడ్డి శనివారం ప్రకటించారు. కాంగ్రెస్‌తో సహా కూటమి పక్షాలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో 19 మంది నేతలు రెబెల్స్‌గా పోటీ చేస్తున్న నేపథ్యంలో వీరిని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్‌ చేసింది. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నారాయణపేట నియోజకవర్గానికి చెందిన మరో ఐదుగురిపైనా ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన కొందరు నేతలు ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీలో నిలిచారు.  అధిష్టాన పెద్దలు బుజ్జగించటంతో కొందరు వెనక్కి తగ్గగా చివరకు 19 మంది పోటీలో నిలిచారు. ఈ నేపథ్యంలో వీరిని సస్పెండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకుంది.  

సస్పెండైన నేతల జాబితా.
ఆయా నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రవి శ్రీనివాస్‌ (సిర్పూర్‌), బోడ జనార్దన్‌ (చెన్నూరు), హరినాయక్‌ (ఖానాపూర్‌), అనిల్‌జాదవ్‌ (బోథ్‌), నారాయణరావు పటేల్‌ (ముథోల్‌), అరుణతార (జుక్కల్‌), ఆర్‌.రత్నాకర్‌ (నిజామాబాద్‌), గణేశ్‌ (సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌), కె. శివకుమార్‌రెడ్డి (నారాయణపేట), ఇబ్రహీం (మహబూబ్‌నగర్‌), సురేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), కేతావత్‌ బిల్యా నాయక్‌ (దేవరకొండ) పాల్వాయి శ్రవణ్‌కుమార్‌రెడ్డి (మునుగోడు) డాక్టర్‌ రవికుమార్‌ (తుంగతుర్తి), మలావత్‌ నెహ్రూ నాయక్‌ (డోర్నకల్‌) ఊకె అబ్బయ్య (ఇల్లెందు), బానోత్‌ బాలాజీ నాయక్‌ (ఇల్లెందు), ఎడవల్లి కృష్ణ (కొత్తగూడెం), రాములు నాయక్‌ (వైరా)లను ఆరేళ్లు సస్పెండ్‌ చేయగా.. నారాయణపేట నియోజకవర్గానికి చెందిన చిట్టెం అభినయ్‌రెడ్డి, కావలి నరహరి, సాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, సౌభాగ్యలక్ష్మిలను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు క్రమశిక్షణా సంఘం బహిష్కరించింది. 

మరిన్ని వార్తలు