టీడీపీ వీధి నాటకాలాడుతోంది

9 Apr, 2018 01:32 IST|Sakshi

     తెలుగుదేశం పార్టీపై కాంగ్రెస్, బీజేపీ మండిపాటు 

     ప్రధాని నివాసం వద్ద ధర్నా ఓ జిమ్మిక్కు 

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ చేసే నిరసనలన్నీ వీధినాటకాలని జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మండిపడ్డాయి. ప్రధాని మోదీ నివాసం వద్ద టీడీపీ ఎంపీల ధర్నాను ఓ జిమ్మిక్కుగా అభివర్ణించాయి. ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మాట్లాడుతూ.. టీడీపీ నాలుగేళ్లు పాటు ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇంతకాలం ప్రభుత్వంలో కొనసాగి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్యాకేజీకి అంగీకరించిన తర్వాత ఇప్పుడు మేల్కొని హోదా కోసం పోరాడతామనడం చంద్రబాబు అజ్ఞానానికి నిదర్శనమన్నారు. టీవీ కెమెరాల దృష్టిని ఆకర్షించడం కోసం టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారన్నారు.  

రాజీనామాలు తప్ప.. 
బీజేపీ ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయకుండా ఎలాంటి జిమ్మిక్కులకైనా పాల్పడతారని ధ్వజమెత్తారు. చౌకబారు ప్రచారం కోసం ఢిల్లీ వీధుల్లో నాటకాలు ఆడుతున్నారని, టీవీల్లో, పేపర్లలో కనిపించడానికి తాపత్రయపడుతున్నారని విమర్శించారు. టీడీపీ  రోజురోజుకూ నిరాశలో కూరుకుపోతోందని, రాజకీయ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని అన్నారు. ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చే ముందు ప్రధాని మోదీని కలసి తమ డిమాండ్లు ఏమిటో ఎందుకు వినిపించలేదని నరసింహారావు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు