నియంతల పాలనపై పోరాటం

29 Dec, 2017 01:42 IST|Sakshi

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ పిలుపు

ఘనంగా కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

సాక్షి, హైదరాబాద్‌: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్ఫూర్తితో కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న నియంతల పాలనను అంతమొందిం చాలని  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ 133వ ఆవిర్భావ దినోత్సవాన్ని గాంధీభవన్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జెండాను ఎగురవేశారు.  దేశ ప్రజలు ఉన్నంత కాలం కాంగ్రెస్‌ మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. పార్టీకి నాయకత్వం వహించిన గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీ వంటి మహనీయుల వారసత్వ పార్టీ అయిన కాంగ్రెస్‌లో పనిచేయడం అదృష్టమన్నారు.

ఎంతోమంది యువకులు ఆత్మబలిదానాలు, నాయకుల త్యాగాలతో వచ్చిన రాష్ట్రంలో ఇప్పటికే 3,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడానికి, ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని అన్ని పార్టీలు కోరుతున్నా సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మహిళలపై దాడుల్లో రాష్ట్రం రెండోస్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం వైఫల్యం చెందారన్నారు.  

ఆకాంక్షలను నీరుగారుస్తున్న సీఎం
కాగా సీఎల్పీ మాజీ నేత పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్‌) వర్ధంతి సభలో పాల్గొన్న ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్షలను సీఎం కేసీఆర్‌ నీరుగారుస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన అనుక్షణం పోరాడిన పీజేఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమన్నారు. మెట్రోరైలు, కృష్ణా జలాల సాధన, పోతిరెడ్డిపాడు అంశాల్లో పీజేఆర్‌ పోరాటం మరువలేనిదన్నారు. భట్టి, సీఎల్పీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు