రేవంత్‌ అరెస్ట్‌పై స్పందించిన టీపీసీసీ

4 Dec, 2018 10:59 IST|Sakshi
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. రేవంత్‌పై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈసీ ఆదేశాలతో కొడంగల్‌లోని రేవంత్‌ నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన సోదరులతో పాటు, ముఖ్య అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అర్ధరాత్రి రేవంత్‌ను దుర్మార్గమైన పద్దతిలో అరెస్ట్‌ చేయడం అరాచక పాలనకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ సభ విఫలమవుతుందనే భయంతోనే .. టీఆర్‌ఎస్‌ ఇలాంటి టైర్రరైజ్‌ పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అర్దరాత్రి తలుపులు పగల కొట్టి రేవంత్‌ను, అతని అనుచరులను అరెస్ట్‌ చేసి భయబ్రాంతులకు గురిచేయడం చూస్తుంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల సంఘం, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

ఒక పార్టీ ఫిర్యాదు చేస్తే ఇంత సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం.. కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలతో ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరని తెలిపారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్‌ గెలుస్తుందని.. తాము అధికారంలోకి వచ్చాక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజస్వామ్య పాలనలో స్వేచ్ఛాయుత పోలింగ్‌ జరిగేలా చూడాలని.. లేకపోతే ప్రజలు తిరగబడక తప్పదని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు