ప్రభుత్వాల మెడలు వంచాలంటే.. యువత ముందుకు రావాలి

19 Jul, 2018 08:24 IST|Sakshi
మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

రైల్వేకోడూరు అర్బన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేకహోదా, కడప జిల్లాకు ఉక్కుపరిశ్రమ సాధించాలంటే యువత పోరాటాలను ఉధృతం చేయాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 25న ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన మానవహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం జీపుజాతాను ప్రారంభించారు. రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేకహోదా, కడపకు ఉక్కు పరిశ్రమ సాధనకు ఏపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జీపుజాతా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా, పరిశ్రమలు, విద్యాసంస్థలు, నిధులు ఇవ్వకుండా నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. అలాగే చంద్రబాబు ఇంటికో జాబు అని ప్రజలను మోసం చేసి బామ్మర్దికి ఎమ్మెల్యే, కొడుకుకు మంత్రి ఉద్యోగాలు ఇప్పించారని విమర్శించారు.

కేంద్రం నాడు కడపలో ఉక్కుపరిశ్రమ నెలకొల్పుతామని హామీ ఇచ్చి నేడు కుదరదని చెప్పడం దారుణమన్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేకహోదా 15 ఏళ్లు ఇస్తామని చెప్పి  నేడు  నయవంచన చేస్తే ప్రజలు సహించరని పేర్కొన్నారు. అలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని విద్యార్ధులు తెలి పారు. విభజన సమయంలో కేంద్రం పార్లమెంటులో ఇచ్చిన హామీలను రాబట్టుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమై, నేడు రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముందు బయటకు వచ్చి పోరా టాలు, దీక్షలంటూ నాటకాలు ఆడుతోందని విమర్శించారు.

అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.సీపీఐ నాయకులు రాధాకృష్ణ, జయచంద్ర, చెన్నయ్య, సీపీఏం రాష్ట్ర నాయకులు బీ నారాయణ, సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యుడు సీహెచ్‌ చంద్రశేఖర్, వైఎస్సార్‌సీపీ నాయకులు గుంటిమడుగు సుధాకర్‌రాజు, సీహెచ్‌ రమేష్, మందల నాగేంద్ర, తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, నందాబాల, సులోచన, సుదర్శనరాజు, చల్లా రాజశేఖర్, తుమ్మల అనిల్‌రెడ్డి, కాజా అహ్మతుల్లా, రమనాథరెడ్డి, కిషోర్,జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, ముత్యాల కిషోర్, కాంగ్రెస్‌ నాయకులు జయప్రకాష్‌ నారాయన వర్మ, జైబీమ్‌ తుమ్మల సురేష్, విద్యార్ధి నాయకులు రాజశేఖర్, బండారు మల్లి, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు