హామీల అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం

22 Nov, 2018 09:03 IST|Sakshi
రోడ్‌షోలో మాట్లాడుతున్న దగ్గుబాటి పురందేశ్వరి

కేంద్ర ప్రభుత్వ నిధుల దుర్వినియోగం  

రాష్ట్రంలో బీజేపీ అధికారం ఖాయం

మల్కాజిగిరి రోడ్‌షోలో బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి

గౌతంనగర్‌: కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి మల్కాజిగిరి, గౌతంనగర్, ఉత్తంనగర్, ఆనంద్‌బాగ్‌లలో మల్కాజిగిరి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి ఎన్‌. రాంచందర్‌రావుతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఇంటింటికీ ఉద్యోగం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ల నిర్మాణం అమలుకు నోచుకోలేదన్నారు. స్వచ్ఛ భారత్‌ కోసం  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  దుర్వినియోగం చేసిందన్నారు.

రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పార్టీకి గద్దెను దింపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. మల్కాజిగిరి నియోజవర్గంలో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఒంటెత్తు పోకడలతోనే నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సమర్ధుడు, అందరికీ అందుబాటులో ఉండే బీజేపీ ఆభ్యర్థి ఎన్‌. రాంచందర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమమని, బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఎన్‌. రాంచందర్‌రావు, మల్కాజిగిరి నియోజకవర్గం బాధ్యులు ఎస్, శ్రీనివాస్‌ముదిరాజ్, నాయకులు ఆర్‌.కే. శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు