ఈసీకి గులాబీ రంగు రోగం సోకింది

28 Oct, 2018 02:33 IST|Sakshi

దాసోజు శ్రవణ్‌ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పత్తి పంటలకు సోకిన గులాబీ రంగు రోగం ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కు సోకినట్టుందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడినా గులాబీ మత్తులో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తాబేదార్లుగా మారడం సరైంది కాదన్నారు.

కమిషన్‌ వ్యవహారశైలి చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా, స్వేచ్ఛగా జరిగే పరిస్థితులు కల్పించడం లేదనే అనుమానం కలుగుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడల్లా తాము ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరగవనడానికి ఈ నెల 26న సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన మెమో నం:1,605 సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. 9 లక్షల ఈవీఎం బ్యాలెట్‌ పేపర్లను ముద్రించాలని ఈ ఉత్తర్వుల్లో ఉందని, అధికార పార్టీకి చెందిన గులాబీ రంగులో బ్యాలెట్‌ పత్రాలను ఎలా ముద్రిస్తారని ఆయన ప్రశ్నించారు.  

వేరే రంగే లేదా?
ప్రపంచంలో వేరే రంగే లేనట్టు, ఎన్నికల బూత్‌లకు, బ్యాలెట్‌ పేపర్లకు గులాబీ రంగు వాడుతుంటే అసలు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని శ్రవణ్‌ ప్రశ్నించారు. ప్రజల వద్దకే ఎన్నికల కమిషన్‌ వెళ్లి టీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేయాలని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్‌ జరుగుతున్నా, కాంగ్రెస్‌ నేతలు ఎటు వెళుతున్నారు, ఏం మాట్లాడుతున్నారనే అంశాలపై ఇంటెలిజెన్స్‌ నివేదికలు తయారు చేస్తున్నా కమిషన్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

తమ నేతల వాహనాలు ఆపుతూ తనిఖీల పేరిట వేధిస్తున్నారని, పాత కేసులు తిరగదోడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా ఎన్నికల కమిషన్‌ కళ్లు మూసుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. యథారాజా తథా ప్రజా అన్నట్లు ఇప్పుడు జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌ సింగ్‌ కూడా మీడియాను బెదిరిస్తున్నారని, ఇది సరైంది కాదని దాసోజు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు