తెలంగాణకు నేడు కేంద్ర ఎన్నికల బృందం, ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఎప్పటి నుంచంటే..

1 Nov, 2023 07:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం నేడు(నవంబర్‌ 1) రాష్ట్రంలో పర్యటించనుంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆరా తీయనుంది. ఈ క్రమంలో అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించనుంది. 

ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం బుధవారం హైదరాబాద్‌కు రానుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మలతో కూడిన బృందం ఉదయం తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌తో భేటీ అవుతుంది. అనంతరం  తనిఖీలు, స్వాధీనాలపై సమీక్షలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో సమావేశం కానుంది.

మధ్యాహ్నాం నోడల్ అధికారులతో సమీక్ష, ఆపై తెలంగాణ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో ప్రత్యేకంగా రివ్యూ కార్యక్రమం సాగనుంది. రేపు కూడా ఈసీ బృందం హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు సమాచారం.  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితరాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలుదఫాలుగా కేంద్రం ఎన్నికల సంఘం..  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు అధికారులతోనూ సమావేశాలు నిర్వహించింది. 

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 7న ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, ప్రచురించడం వంటివి చేయరాదని ఈసీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. 

తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఒకే విడతలతో పోలింగ్‌.. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు