ఎంపీ కవితపై డీఎస్‌ కుమారుడి మండిపాటు!

27 Jun, 2018 11:44 IST|Sakshi
ధర్మపురి అరవింద్‌ (పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌/నిజామాబాద్‌ : రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌)పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, అవరసమైతే ఆయనపై వేటు వేయాలని నిజామాబాద్‌ జిల్లా అధికార పార్టీ నేతలు సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు. ఈ మేరకు నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు పార్టీ ఎంపీ కవిత నివాసంలో డీఎస్‌ విషయంపై భేటీ అయ్యి చర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డీఎస్‌ అక్రమాలకు సంబంధించి నాలుగు పేజీల లేఖను ఎంపీ కవితకు అందజేసి, సీఎం కేసీఆర్‌కు పరిస్థితి వివరించాలని కోరినట్లు సమాచారం.  

డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారని, మరోవైపు టీఆర్‌ఎస్‌ నుంచి ఆయనపై వేటుకు రంగం సిద్ధమైందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై డీఎస్‌ కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ ‘సాక్షి’  మీడియాతో మాట్లాడారు. ‘టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత గత నాలుగేళ్లుగా జిల్లాలో కనబడటం లేదు. మా కుటుంబం జిల్లాలో యాక్టీవ్‌గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాతే కవిత వెలుగులోకి వచ్చారు. నాలుగేళ్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ఆమె చేయలేదు. ఏదో సెలబ్రిటీగా ఎప్పుడో ఓసారి జిల్లాలో పర్యటించేవారు తప్ప ఆమె నిజామాబాద్‌ జిల్లా కోసం చేసిందేమీ లేదు. తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని కార్యకర్తలు స్వయంగా డీఎస్‌కు లేఖలు ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్‌ అంతా సాధారణంగా పనిచేస్తుంది. గత మూడు రోజులుగా డీఎస్‌ ఏ కాంగ్రెస్‌ నేతను కలిశారో చెప్పాలని’ అరవింద్‌ డిమాండ్‌ చేశారు.

ఓటమి భయంలో కవిత..
బీజేపీని టీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయాల్లోకి లాగడాన్ని ఆయన ఖండించారు. ‘నా తండ్రి డీఎస్‌ నాకు బీజేపీలో సాయం చేయడమేంటి ?. డీఎస్‌, కవిత.. అది టీఆర్‌ఎస్‌ పార్టీ అంతర్గత విషయం. ఓటమి భయంలో కవిత ఉన్నారు. అందుకే ఇలాంటి చర్యలకు సిద్ధపడుతున్నారు. నాకోసం మానాన్ని డీఎస్‌ ఒక్క ఫోన్‌ కూడా చేయలేదు. డీఎస్‌ను బీజేపీలోకి తేవాలంటే మా నాయకత్వం చూసుకుంటుందని’  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరవింద్‌ వివరించారు.

గత మూడ్రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో డీఎస్‌ మంతనాలు జరిపారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. డీఎస్‌పై చర్యలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్‌కు సిఫార్స్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ కవితతో జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బుధవారం భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. డీఎస్‌ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నాడని లేఖలో పార్టీ నేతలు పేర్కొన్నారు. డీఎస్‌ గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉండగా, మరోవైపు ఎంపీ కవిత రెండు రోజులుగా జిల్లాలోనే ఉండటం గమనార్హం. 

కుమారుడికి పదవి, ప్రాధాన్యం ఇవ్వలేదనే డీఎస్‌..
టీఆర్‌ఎస్‌లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని డీఎస్‌ భావిస్తున్నట్లు కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇదివరకే ఓ కుమారుడు అరవింద్‌ బీజేపీలో చేరగా, మరో కుమారుడు సంజయ్‌కి ప్రొటోకాల్‌ వర్తించేలా ఏదైనా ప్రాధాన్యం ఉన్న పదవి ఇవ్వాలని పలుమార్లు పార్టీ అధిష్టానికి డీఎస్‌ సూచించిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు, తన కుమారుడికి ప్రాధాన్యం లభించకపోవడంతో కాంగ్రెస్‌ వైపు డీఎస్‌ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు