వారికి డబుల్‌ ధమాకా.. వీరికి ఝలక్‌!

13 Nov, 2018 14:53 IST|Sakshi

అసమ్మతి నేతలకు అధిష్టానం బుజ్జగింపులు

ఢిల్లీలో జోరుగా ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాపై ఆ పార్టీలోనే భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పలువురు సీనియర్‌ నేతలకు సైతం టికెట్‌ దక్కకపోగా.. ప్రభావవంతమైన మూడు కుటుంబాలకు మాత్రం రెండేసి సీట్లు దక్కాయి. పార్టీలో చురుగ్గా ఉన్న నేతలు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌, అద్దంకి దయాకర్‌రావు, గండ్ర వెంకటరమణారెడ్డితో సహా భిక్షపతి యాదవ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి వంటి నేతలకు టికెట్లు దక్కలేదు. ఇక, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క కుటుంబాలకు రెండేసి టికెట్లు దక్కాయి. మరోవైపు సీనియర్‌ నేతలుగా ఉన్న జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ముఖేశ్‌ గౌడ్‌ తమ వారసులకు టికెట్లు సాధించలేకపోయారు. జానారెడ్డి తన కొడుకు మిర్యాలగూడ టికెట్‌ కోరుతూ ఢిల్లీలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండగా.. సబితారెడ్డి కొడుకు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్‌ లేదా షాద్‌నగర్‌ టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పొన్నాలతోపాటు అద్దంకి దయాకర్‌, పాల్వయా స్రవంతి తదితర నేతలు ఢిల్లీలోనే ఉండి టికెట్‌ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓయూ విద్యార్థి నేతలకు సైతం
కాంగ్రెస్‌ పార్టీ మొదటి జాబితాలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు సైతం నిరాశ ఎదురైంది. ఓయూ జేఏసీ నేతలకు ఈసారి అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్‌ అధినాయకత్వం ఊరించింది. కానీ మొదటి జాబితాలో విద్యార్థి నేతలకు అవకాశం కల్పించలేదు. జాబితాలలో తన పేరు లేకపోవడంతో ఓయూ విద్యార్థి నేత మానవతారాయ్‌ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని విద్యార్థులందరికీ వివరిస్తానని.. మహాకూటమికి వ్యతిరేకంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తానని ఆయన ప్రకటించారు. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే వినిపిస్తోంది. బీజేపీ నుంచి కంటోన్మెంట్‌ స్థానంలో బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం.

టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని బలమూరి వెంకట్ భావిస్తున్నారు. వరసగా రెండోసారి ఆయన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాను ఆశించిన పెద్దపల్లి స్థానంలో విజయరమణారావు పేరు ప్రకటించడంతో వెంకట్‌ రాజీనామాకు సిద్ధపడుతున్నారు. ఆయనకు మద్దతుగా ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు, రాష్ట్రకార్యవర్గ నేతలు, కేడర్ రాజీనామా చేసే అవకాశముంది.

మరిన్ని వార్తలు