కేటీఆరే మహిళా మంత్రా?: డీకే అరుణ

29 Nov, 2017 02:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో వేదికపై ఇవాంకా ట్రంప్‌ పక్కన కూర్చున్న కేటీఆర్‌ను మహిళా మంత్రిగా భావించాలా అని ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. మంగళవారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. మహిళే ప్రథమం అనే నినాదంతో జరుగుతున్న ఈ సదస్సులో 52 శాతం మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ కేబినెట్‌లో మహిళా మంత్రులు లేకపోవడం వల్లే కేటీఆర్‌ వేదికపై కూర్చుంటున్నారని విమర్శించారు. ప్రొటోకాల్‌ ప్రకారం అయితే నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు వేదికపై స్థానం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. మెట్రో రైలు ఘనత కాంగ్రెస్‌దేనని, ఉద్యమ సమయంలో కేసీఆర్‌ అడ్డుకోవడం వల్లే ఆలస్యమైందని పేర్కొన్నారు.

మెట్రోను అడ్డుకోవడంలో తప్ప.. పూర్తికావడంలో కేసీఆర్‌ పాత్ర ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మెట్రో ద్వారా ప్రజలపై 3,500 కోట్ల అదనపు భారాన్ని మోపిన ఘనత కేసీఆర్‌దేనని మండిపడ్డారు. మెట్రో ప్రాజెక్టు హైదరాబాద్‌కు రావడానికి కారణమైన కాంగ్రెస్‌ పార్టీ నేతలను ప్రారంభోత్సవానికి పిలవని సీఎం కేసీఆర్‌ కుత్సిత యోచనలకు నిదర్శనమని విమర్శించారు.

మరిన్ని వార్తలు