నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య

12 Nov, 2023 11:46 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : తన భర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అచ్ఛంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భార్య గువ్వల అమల అన్నారు. దాడి ఘటనపై అపోలో ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో దాడులకు తెగబడుతున్నాడు. ప్రచారం ముగించుకొని వెళ్తుండగా మా వాహనాలను అడ్డగించి కార్ల అద్దాలను ధ్వంసం చేసి రాళ్లతో దాడి చేశారు.

నా భర్తకు దవడ, మెడ భాగంలో గాయాలయ్యాయి. డాక్టర్లు ఇప్పటికే స్కానింగ్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. గతంలో వంశీకృష్ణ అనుచరులు నాపై అసభ్యకరంగా మాట్లాడారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ల తీరు మార్చుకోవడం లేదు.

మా కార్యకర్తలను బెదిరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాల్స్ చేస్తున్నారు. నియోజకవర్గానికి వస్తే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నీచమైన రాజకీయాలు సరికాదు. అచ్చంపేట నియోజకవర్గం ప్రజలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన అనుచరులకు బుద్ధి చెప్తారు’ అని గువ్వల భార్య హెచ్చరించారు. 

కేటీఆర్‌ పరామర్శ..
దాడి తర్వాత హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొం‍దుతున్న  గువ్వల బాలరాజును ఆదివారం ఉదయం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు.  

రాళ్ల దాడిలో గువ్వలకు గాయాలు..
కాగా, అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. బీఆర్‌ఎస్‌ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు వెంబడించారు. ఇరు పార్టీల నేతలు రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. 

ఇదీ చదవండి..బీఆర్‌ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి

మరిన్ని వార్తలు