ట్రిపుల్‌.. ట్రబుల్‌

9 Nov, 2018 02:04 IST|Sakshi

ముగ్గురు నేతల మధ్య నలుగుతున్న మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌

కమల్‌నాథ్, సింధియా, దిగ్విజయ్‌ల మధ్య ఆధిపత్య పోరు  

సయోధ్యకు రాహుల్‌ విఫలయత్నం

అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీ కాంగ్రెస్‌. అందుకే పార్టీలో ఆ స్థాయిలోనే అంతర్గత కుమ్ములాటలుంటాయి. ఇవి పార్టీకి తీరని నష్టం చేస్తున్నా.. మాట నెగ్గించుకోవాలనేదే నేతల ప్రయత్నం. మధ్యప్రదేశ్‌లో ఇది కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఈసారి గెలిచేందుకు ఓ మంచి అవకాశం ఉంది. కానీ ఆ పార్టీ మాత్రం ముగ్గురు ముఖ్యనేతల మధ్య నువ్వా–నేనా అన్న పోటీతో ఉన్న అవకాశాన్నీ చేజార్చుకుంటోంది. ఇది పార్టీ శ్రేణులను దిక్కుతోచని స్థితిలో పడేస్తోంది. కేవలం అనైక్యత కారణంగానే నష్టపోతున్నామని తెలిసినా.. పునరాలోచన జరగడం లేదు. అయితే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీపై మరోసారి బీజేపీ జెండా ఎగిరితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చిక్కులు తప్పవనే విషయం కాంగ్రెస్‌ అధిష్టానానికి తెలుసు. అందుకే రాహుల్‌ వీరిమధ్య సయోధ్యకు విఫలయత్నం చేశారు. 

ఎవరికెవరూ తీసిపోరు! 
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఉద్దండ నేతలు ఉన్నారు. యువతను ప్రభావితం చేయగల సింధియా, సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ ఇలా ఎవరికి వారు బడా నేతలే. కానీ వీరి మధ్య ఐక్యత లేకపోవడమే పార్టీకి తీరని నష్టం చేస్తోంది. అధికారాన్ని పువ్వుల్లోపెట్టి బీజేపీకి అప్పగిస్తున్నామని తెలిసినా కూడా ఈ ముగ్గురు నేతలు మంకుపట్టు విడవడం లేదు. అభ్యర్థుల ఎంపిక సమావేశంలో రాహుల్‌ ముందే.. ‘నువ్వేంతంటే – నువ్వెంత’ని దూషించుకునే స్థాయిలో వీరి మధ్య విభేదాలున్నాయి.  

వేడి చల్లారినట్లే అనిపించినా.. 
ఈ సమస్యను ఏడాది క్రితమే గుర్తించిన రాహుల్‌.. వీరి మధ్య రాజీ కోసం సీనియర్లను రంగంలోకి దించారు. దీంతో కాస్త పర్వాలేదనిపించిన పరిస్థితి.. టికెట్ల పంపిణీ దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ వెడెక్కింది. రాహుల్‌ ముందే ఈ ముగ్గురూ ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ అని దాదాపు గొడవపడ్డంత పనిచేశారు. కమల్‌నాథ్‌ వైపు సోనియా.. సింధియాకు మద్దతుగా రాహుల్‌ ఆలోచిస్తున్నారన్న వార్తలు మరింత వేడి రాజేశాయి. 

ఆజ్యం పోస్తున్న బీజేపీ 
ఈ వర్గపోరాటానికి ఆజ్యం పోయడం ద్వారా తన పీఠానికి ఎసరుండొద్దని బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌కు ముగ్గురు సీఎం అభ్యర్థులంటూ మోదీ ఎద్దేవా చేయగా.. దిగ్విజయ్‌కు పార్టీలో సరైన స్థానం లేదంటూ సీఎం చౌహాన్‌ తన ప్రచారంలో పేర్కొంటున్నారు. రాహుల్‌ సభ ప్రచారంలో దిగ్విజయ్‌ ఫొటో కూడా పెట్టకపోవడం ఆయన వర్గానికి ఆగ్రహం తెప్పించింది. అయితే.. దిగ్విజయ్‌ సాయం లేకుండా కమల్‌నాథ్, సింధియాల్లో ఎవరూ సీఎం పీఠాన్ని అధిరోహించలేరనేది మధ్య ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ముక్తకంఠంతో చెబుతోంది.

ఆలు లేదు చూలు లేదన్నట్లు! 
ఈ ముగ్గురూ సీఎం పీఠం కోసం పోటీపడుతున్నారు. అదే అసలు సమస్యకు కారణం. అధికారంలోకి వస్తే ఎవరు సీఎం కావాలనేదే వీరి మధ్య పోటీకి కారణం. ముందు ఎన్నికల్లో గెలిచేలా పనిచేసి.. ఆ తర్వాత సీఎం కోసం కొట్టుకుంటే అర్థముంటుంది. కానీ ఈ ముగ్గురు గెలుస్తామన్న ముందస్తు ధీమాతోనే సీఎం పీఠం గురించి విభేదించుకుంటున్నారు. అత్యంత సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ సీఎం కావాలని ఆయన వర్గం వాదిస్తోంది. యువతను ప్రభావితం చేసే సత్తా, రాజవంశీకుడు కావడం.. పార్టీ యువజన విభాగంపై పట్టున్న సింధియాకే సీఎం పీఠం ఇవ్వాలని ఆయన సన్నిహితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదాల కారణంగా ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడానికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి ధైర్యం చాలడం లేదు. 

‘భక్త’ రాహుల్‌..
జనాభాలో దాదాపు 91 శాతం హిందువులున్న మధ్యప్రదేశ్‌లో హిందుత్వ ముద్ర కోసం బీజేపీతో కాంగ్రెస్‌ పోటీ పడుతోంది. బీజేపీ కన్నా తామే హిందువులకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్పేందుకు తిప్పలు పడుతోంది. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ వివిధ దేవాలయాలు సందర్శిస్తున్నారు. ఇటీవలే ఆయన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర దేవాలయాన్ని దర్శించారు. గతంలో ఇందిర ఈ ఆలయాన్ని సందర్శించిన అనంతరం పదవిని చేపట్టారని అక్కడి పూజారి చెబుతున్నారు. రాహుల్‌ ఆలయ సందర్శనం తప్పక ఫలితమిస్తుందంటున్నారు. మహాకాలుడితో పాటు కమత్‌నాధ్, పీతాంబర్‌ లాంటి ప్రసిద్ధ ఆలయాలన్నింటినీ రాహుల్‌ సందర్శించారు. నర్మదా హారతిలో కూడా పాల్గొన్నారు. రామ వనవాస మార్గాన్ని సూచించే రామ్‌ వన్‌ గమన్‌ యాత్రను కాంగ్రెస్‌ నిర్వహించింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఒక్కో గోశాల నిర్మిస్తామని పీసీసీ చీఫ్‌ కమల్‌నాధ్‌ హామీ ఇస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం ఇప్పటికే పలు గోశాలలు నిర్మించి నిర్వహిస్తోందని, రాష్ట్రంలోని లక్షన్నర గోవుల అభివృద్దికి పలు చర్యలు తీసుకుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  

ప్రతిదాంట్లో మతమే 
రాజకీయ ప్రచారంలో భాగంగా ప్రతి అంశంలో కాంగ్రెస్‌ మత ప్రస్తావన తెస్తోంది. ఉదాహరణకు చౌహాన్‌ రైతు వ్యతిరేక, అవినీతి విధానాలను విమర్శించే సమయంలో కూడా ఏదో రకంగా మతాన్ని ప్రస్తావిస్తోంది. ఉదాహరణకు ‘చౌహాన్‌ ప్రభుత్వం మహాకుంభమేళాను కూడా వదల్లేదు. ప్రతి వస్తువు ధర పదిరెట్లు పెంచడంతో కుంభమేళా నుంచి కోట్లు కూడబెట్టింది.’ అని రాహుల్‌ తన ప్రసంగంలో విమర్శించారు. ‘ బీజేపీ మతం గురించి మాట్లాడుతుంది, కానీ అవినీతే వారి మతం’ అని దుయ్యబడుతున్నారు. ఆదివాసీలను ఆకట్టుకునే క్రమంలో భాగంగా హిందుత్వం అందరిది అనే ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో ఆదివాసీ ప్రాబల్యం ఉన్న 47 సీట్లలో బీజేపీ 31 సీట్లు గెలుచుకుంది.

ఈ ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చేపట్టే సామాజిక కార్యక్రమాలు బీజేపీకి లాభించాయి. ఈ కారణంగానే ఆదివాసీలు తాము సైతం హిందువులమని భావిస్తున్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసులో సుప్రీం తీర్పుపై ఆర్డినెన్సు తీసుకుచ్చిన బీజేపీపై ఓసీ, ఓబీసీలు గుర్రుగా ఉన్నారు. జనాభాలో వీరి వాటా 60 శాతం పైగా ఉంది. వీరంతా గంపగుత్తగా బీజేపీకి ఓట్లేసేవారు. ఇప్పుడు వీరిని ఆకట్టుకోవాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది. అయితే ఎన్నికలప్పుడే కాంగ్రెస్‌కు హిందువులు గుర్తుకువస్తారని, కాంగ్రెస్‌ గిమ్మిక్కులకు అటు దేవుడు, ఇటు హిందువులు మోసపోరని బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు నర్మద పరీవాహక ప్రాంతంలో కనిపించే సాధుసంతులంతా మతాన్ని రాజకీయాలకు వాడుకోవడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. మతాన్ని రాజకీయాలతో కలపడం సబబు కాదని కొందరు హితవు చెబుతున్నారు. 

ఒక్కరోజులో తేలిపోయే ఇంక్‌! 
మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ఓటేయడానికి రావడం కూడా.. స్థానికులు, ఆదీవాసీలకు చాలా ఇబ్బందికరమే. ఓటేశామని తెలిస్తే మావోయిస్టుల నుంచి చిత్రహింసలు తప్పవు. అందుకే.. ఇలాంటి ప్రాంతాల్లో ఓటేసేవారికోసం ఈసీ కొత్తగా ఆలోచిస్తోంది. మామూలుగా చేతిపై ఉన్న సిరా ముద్ర మాత్రమే మనం ఓటేసినట్లు తెలుపుతుంది. అయితే.. ఓటు వేసిన తర్వాత ఆ గుర్తు లేకుండా చేస్తే అసలు సమస్యే ఉండదు. వాస్తవానికి 2013 అసెంబ్లీ, 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఇలాంటి ప్రతిపాదనలు ఈసీకి అందాయి. కానీ చెరిగిపోయే సిరాతో.. బోగస్‌ ఓటింగ్‌ జరిగేందుకు వీలుంటుందని ఆలోచించింది. అయితే.. ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా ఆ ఓటర్ల గురించి సానుకూలంగా ఆలోచించాలని కోరడంతో.. అందరితోనూ చర్చించి ఓ సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అంతాఅనుకున్నట్లుగా జరిగితే.. ఈ ఎన్నికల్లోనే ఒక్కరోజులోనే తేలిపోయే ఇంకుతో సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్‌ నిర్వహించాలన్న యోచనలో ఉంది.  

ఒక ఊరు.. నలుగురు ఓటర్లు! 
నవంబర్‌ 12న ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌ ఇప్పుడు సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారింది. భరత్‌పూర్‌ నియోజకవర్గంలోని షెరందంద్‌ ఊర్లోని ఓ పోలింగ్‌ బూత్‌లో కేవలం నలుగురంటే నలుగురే ఓటర్లుండటం ఈ ఎట్రాక్షన్‌కు కారణం. ఏ ఒక్క ఓటరూ.. తన హక్కును కోల్పోకూడదని సకల ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఈ నలుగురి కోసం కూడా పోలింగ్‌ బూత్‌ను సిద్ధం చేయనుంది. అయితే బూత్‌ కోసం సరైన వసతుల్లేకపోవడంతో ఓ టెంట్‌ కిందే పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊరుంటుంది. కానీ ఇక్కడి చేరుకోవడం ఓ సాహసమే. రోడ్డు మార్గం లేదు. కనీసం కాలిబాట కూడా ఉండదు. రోడ్డుకు కొద్ది దూరంలో ఉండే పెద్ద నదిని దాటి.. ఆ తర్వాత రాళ్లు, రప్పల మధ్య రెండు కొండలు ఎక్కిదిగితే గానీ ఆ ఊరికి చేరుకోలేం. 

మరిన్ని వార్తలు