ఫస్ట్‌ టైమ్‌.. ‘బ్రెయిలీ’ ఈవీఎం

19 Nov, 2018 01:41 IST|Sakshi

బ్యాలెట్‌ పేపర్లు కూడా.. 

బ్రెయిలీ లిపిలోనే గుర్తింపుకార్డులు

దివ్యాంగుల కోసం ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక ఏర్పాట్లు

అవయవ వైకల్యం ఉన్నవారికి 20 వేల చక్రాల కుర్చీలు

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు అనే ఆయుధం కీలకం. దాన్ని సరిగా వినియోగించుకోకుంటే అనర్థాలు అనేకం. మనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది ‘రహస్య ఓటింగ్‌’ ద్వారా జరుగుతుంది. అయితే, దివ్యాంగులు, అంధులు, ఇతర శారీరక వైకల్యం ఉన్నవారికి మాత్రం రహస్య ఓటింగ్‌ అనేది గగనమైంది. ఓటు వేసేప్పుడు వారు ఇతరులపై ఆధారపడక తప్పడంలేదు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ తెలంగాణలో వికలాంగ సంక్షేమశాఖ, ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అంధుల కోసం ఏకంగా బ్రెయిలీ లిపిలో ఈవీఎంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనుమతికి ప్రత్యేక ఫైలు పంపించింది. ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’ పేరిట ఎన్నికల కమిషన్‌ విస్త్రృత ఏర్పాట్లు చేస్తోంది. 

బ్రెయిలీ లిపిలో ఈవీఎంలు, బ్యాలెట్లు 
రాష్ట్రంలోని అంధ ఓటర్ల కోసం 31 జిల్లాల పరిధిలోని 217 పోలింగ్‌ కేంద్రాల్లో బ్రెయిలీ లిపి ఈవీఎంలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లోని అంధుల ఓటర్లను ఆధారం చేసుకొని వీటిని అందుబాటులో ఉంచుతారు. ఇంకా ఓటరు గుర్తింపు కార్డు, బ్యాలెట్‌ పేపరు, ప్రచార కరపత్రాలను బ్రెయిలీ లిపిలో ప్రత్యేకంగా ముద్రిస్తున్నారు. బ్యాలెట్లు, ఈవీఎంలపై క్రమపద్ధతిలో అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తు బ్రెయిలీ లిపిలో ఉంటాయి. బ్యాలెట్‌ను చేతితో తడిమి గుర్తించాక ఈవీఎంల వద్దకు వెళ్లి ఎవరి సాయం లేకుండానే అంధులు ఓటు వేయవచ్చు. 

శారీరక వికలాంగులకు చక్రాల కుర్చీ
శారీరక వికలాంగులైతే ప్రతీ పోలింగ్‌ కేంద్రంలోనూ చక్రాల కుర్చీ అందుబాటులో ఉంచనున్నారు. 32,796 పోలింగ్‌ కేంద్రాల్లో సుమారు 20 వేల చక్రాల కుర్చీలు అవసరమని అంచనా. వీటిలో రెండు వేల కుర్చీలను వికలాంగుల సంక్షేమశాఖ సమకూర్చింది. వికలాంగులను పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకు వెళ్లేందుకు ప్రత్యేక ర్యాంప్‌లు నిర్మిస్తున్నారు. ఒక్కో ర్యాంప్‌కు రూ.8 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో తాత్కాలిక ర్యాంప్‌లు ఏర్పాటు చేస్తారు. వీల్‌ఛైర్‌ గదిలోకి తీసుకెళ్లడం, తీసుకురావడం ఇలా ప్రతీ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు జారీచేసింది. ఇక పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వికలాంగులతో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎన్నికల అధికారులకు సూచనలు ఇస్తున్నారు. అంధులు, బధిరుల కరపత్రాలతోపాటు వీటినీ పంపిణీ చేస్తారు. 

రెండు మూడు నియోజకవర్గాల్లో వారి ప్రభావం.. 
రాష్ట్రంలో కనీసం రెండు మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను దివ్యాంగ ఓటర్లు ప్రభావితం చేయగల సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తంగా 6,39,276 మంది దివ్యాంగులు ఉన్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 38,958 మంది ఉన్నారు. తరువాత స్థానాల్లో రంగారెడ్డి జిల్లాలో 37,147 మంది, ఖమ్మంలో 34,110, హైదరాబాద్‌లో 33,362, కరీంనగర్‌జిల్లాలో 30,643, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 30,169 మంది ఓటర్లున్నారు. కొమురంభీం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పదివేల లోపు ఓటర్లుండగా, మిగిలిన జిల్లాల్లో 14 వేలకు తగ్గకుండా దివ్యాంగ ఓటర్లున్నారు. అయితే దివ్యాంగ ఓటర్లు ఇంకా కొంతమేరకు పెరిగే అవకాశముందని ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారం 7.40 లక్షలు ఉండే అవకాశముందని అంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత వస్తుందంటున్నారు.
..::: బొల్లోజు రవి

ఎన్నో సదుపాయాలు
ఈసారి ఎన్నికల్లో దివ్యాంగులు పూర్తి స్థాయిలో ఓటు వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బ్రెయిలీ లిపిలో గుర్తింపు కార్డులు, ఈవీఎంలు ఈ చర్యల్లో భాగమే. బధిర ఓటర్ల కోసం సంజ్ఞల భాషలో కరపత్రాన్ని రూపొందించాం. ఎన్నికల సామగ్రితోపాటు వీటినీ అధికారులకు అందజేస్తాం. ఓటు వేయడానికి వచ్చే బధిరులను కరపత్రంలో సూచించిన సంజ్ఞలతో అధికారి సమన్వయం చేసుకుంటారు. కరపత్రంలో 11 అంశాలతో కూడిన వివరాలు ఉంటాయి. పోలింగ్‌ కేంద్రానికి వచ్చింది మొదలు వెళ్లే వరకు బధిర ఓటరును ఎన్నికల అధికారి సంజ్ఞల ద్వారా ఆయా విషయాలు అడుగుతారు. ఉదాహరణకు ‘మీ పేరు, వినికిడి లోపమా?, మాట్లాడలేరా?, ఓటరు కార్డు స్లిప్‌ చూపించండి, లిస్ట్‌లో పేరుందా, ఎడమ చేతిపై సిరా వేయించుకోండి, సిరాను ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదు, ధన్యవాదాలు’ అనే సంజ్ఞల భాషతో  కరపత్రం ఉంటుంది.  
– బీ.శైలజ, రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి

మరిన్ని వార్తలు