కౌన్‌ బనేగా ఎమ్మెల్యే

11 Dec, 2018 08:02 IST|Sakshi

ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం  

12 కేంద్రాల్లో గ్రేటర్‌లోని 24 నియోజకర్గాల కౌంటింగ్‌  

పకడ్బందీ ఏర్పాట్లు

తొలి ఫలితం చార్మినార్‌దే.. చివరగా శేరిలింగంపల్లి

ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటు   

ప్రతి రౌండ్‌కూ 14ఈవీఎంల ఫలితాలు   

తొలుత పోస్టల్‌ బ్యాలెట్, సర్వీస్‌ ఓట్ల లెక్కింపు

ప్రతి టేబుల్‌కు సూపర్‌వైజర్, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్‌

ర్యాలీలకు అనుమతి లేదు

బాణసంచా కూడా కాల్చొద్దు  

కౌంటింగ్‌ కేంద్రాల్లో భారీ బందోబస్తు  

144 సెక్షన్‌ అమలు 

సాక్షి, సిటీబ్యూరో: విన్నర్‌ ఎవరో.? లూజర్‌ ఎవరో.? నేడు తేలిపోనుంది. మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల కౌంటింగ్‌.. వాటిని భద్రపరిచిన 12 కేంద్రాల్లో మంగళవారం జరగనుంది. ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించి.. ఆ తర్వాత రౌండ్ల వారీగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌(ఈవీఎం)లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. తొలి గంటలోనే విజేత ఎవరో తేలిపోయే అవకాశం ఉండగా.. మధ్యాహ్నం 12గంటల తర్వాతే అధికారికంగా విజేతల వివరాలు వెల్లడవుతాయి. అయితేనగరంలో 198 పోలింగ్‌ బూత్‌లున్న చార్మినార్‌ నియోకజవర్గ ఫలితమే తొలుత రానుంది. ఇక 210 బూత్‌లున్న సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఫలితం సెకండ్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు నియోజకవర్గాల ఈవీఎంలనూ 15 రౌండ్లలో లెక్కించనున్నారు. అత్యధిక బూత్‌లున్న శేరిలింగంపల్లిలో 42 రౌండ్లు, ఎల్బీనగర్‌లో 37 రౌండ్లు, కుత్బుల్లాపూర్‌లో 33 రౌండ్ల చొప్పున ఓట్లు లెక్కించనున్నారు. ఈ మూడు నియోకజవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం తర్వాతే పూర్తి కానుంది. 

బెట్టింగ్‌ల జోరు...  
సిటీలోని రెండు నియోజకవర్గాల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీ చేసిన సనత్‌నగర్‌.. టీఆర్‌ఎస్, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూకట్‌పల్లి ఫలితాలపై పందేలు పెద్ద ఎత్తున కాస్తున్నారు. సనత్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని, టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్‌గౌడ్‌ల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. భారీ మెజారిటీపై తలసాని ఆశలు పెట్టుకోగా.. ఓడించి తీరుతానని వెంకటేష్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కూకట్‌పల్లిలో వరుసగా రెండోసారి విజయం సాధిస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, సినీ నటుడు బాలకృష్ణల ప్రచార హోరు కారణంగా తాను విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని టీడీపీ అభ్యర్థి సుహాసిని పేర్కొన్నారు.

అంతటా ఆసక్తి...  
ఫలితాలపై అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తుంది? ఎవరెవరు విజయం సాధిస్తారు? కూటమి ఫలితాలు ఎలా ఉంటాయి? ఇలా వివిధ అంశాలపై సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక తొలి ఫలితం ఏ నియోజకవర్గనిదని ఆసక్తిగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్‌ కేంద్రాలు, ఎన్ని రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అధికారులు సైతం అంచనాలు వేస్తున్నారు. నగరానికి సంబంధించి తొలి ఫలితాలు చార్మినార్, సనత్‌నగర్‌ నియోజకవర్గాలవి కావచ్చనే అంచనాలున్నాయి. అలాగే ఆలస్యమయ్యే నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌ తదితర ఉన్నాయి. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు. సహజంగానే తొలి రౌండ్‌ లెక్కింపునకు కొంత ఆలస్యమవుతుందని, క్రమంగా లెక్కింపు వేగం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన అభ్యర్థుల సంఖ్య, రౌండ్లు, లెక్కింపు కేంద్రాల్లోని అధికారుల పనితీరు, రాజకీయ ప్రతినిధుల ప్రమేయం తదితర పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో రౌండ్‌కు 10–25 నిమిషాల సమయం పడుతుందనే అంచనాలున్నాయి.  

నియోజకవర్గానికి 14 టేబుళ్లు...
హైదరాబాద్‌ జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల వంతున ఏర్పాటు చేశారు. రిటర్నింగ్‌ అధికారికి మరో టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి ముందు ప్రిసైడింగ్‌ అధికారి సంతకంతో ఉన్న సంబంధిత(17సీ ) ఫారం వివరాలను రాజకీయ పార్టీల ఏజెంట్లకు తెలియజేస్తారు. ఈ ఫారంలో ఈవీఎంల వారీగా పోలైన ఓట్ల వివరాలను పోలింగ్‌ రోజునే నమోదు చేస్తారు. ఆ సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్య సమానంగా ఉన్నదీ లేనిదీ సరి చూస్తారు. వాటిని ఏజెంట్లకు కూడా చూపించి, వారి సంతకాలు తీసుకుంటారు. అనంతరం ఈవీఎంల సీల్‌ తొలగించి ‘రిజల్ట్‌’ బటన్‌ నొక్కితే మొత్తం పోలైన ఓట్లు, అభ్యర్థుల వారీగా పోలైన ఓట్ల వివరాలు తెలుస్తాయి. 14 టేబుళ్లను ఏర్పాటు చేయడంతో ఒక్కో రౌండ్‌కు 14 ఈవీఎంల ఫలితాలు తెలుస్తాయి. పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి ఈ రౌండ్ల సంఖ్య మారుతుంది. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద సూపర్‌వైజర్, అసిస్టెంట్‌ సూపజర్‌వైజర్‌లతో పాటు మైక్రో అబ్జర్వర్‌ కూడా ఉండి పరిశీలిస్తారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా సంతృప్తి చెందాకే ప్రతి రౌండ్‌ ఫలితాన్ని వెల్లడిస్తారు. ఈసారి తొలిసారిగా వీవీప్యాట్లను ప్రవేశపెట్టడంతో ఒక నియోజకవర్గానికి సంబంధించి లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఏదో ఒక పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన వీవీ ప్యాట్లలలోని స్లిప్‌లను కూడా లెక్కిస్తారు. వాటిల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చింది పరిశీలించి, ఈవీఎంల లెక్కలోనూ అవి సరిగ్గా ఉన్నదీ, లేనిదీ పరిశీలిస్తారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా... తొలుత పోస్టల్, సర్వీస్‌ ఓట్లను లెక్కిస్తారు. అరగంటలోగా అవి పూర్తికాగలవని, 8:30గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

లెక్కింపుకేంద్రాలివీ...  
ఎల్బీస్టేడియం: ముషీరాబాద్,నాంపల్లి  
యూసుఫ్‌గూడ స్టేడియం:ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌
అంబర్‌పేట మున్సిపల్‌ స్టేడియం:మలక్‌పేట  
ఓయూ క్యాంపస్‌: సనత్‌నగర్,సికింద్రాబాద్‌
మాసబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌: కార్వాన్,బహదూర్‌పురా  
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌: యాకుత్‌పురా, చార్మినార్‌
నిజాం కళాశాల: చాంద్రాయణగుట్ట
రెడ్డి ఉమెన్స్‌ కాలేజీ(నారాయణగూడ): అంబర్‌పేట
కోఠి మహిళా కళాశాల: గోషామహల్‌
వెస్లీ కాలేజీ: కంటోన్మెంట్‌  
పాల్మాకుల విజయకృష్ణ ఇంజినీరింగ్‌కళాశాల: శేరిలింగంపల్లి,ఎల్బీనగర్, మహేశ్వరం,రాజేంద్రనగర్‌
భోగారం హోలీమేరీ ఇంజినీరింగ్‌ కళాశాల: మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌

మరిన్ని వార్తలు