సుష్మాకు నో ప్లేస్‌ : గుండె పగిలిన ట్విటర్‌  

30 May, 2019 20:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నసుష్మా స్వరాజ్‌ (66)కు మోదీ 2.oలో  చోటు దక్కలేదు. ప్రధానమంత్రి నరేం‍ద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు రెండోసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ సుష్మాకు అవకాశం దక్కలేదు. అయితే మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తరహాలోనే సుష్మా కూడా కేంద్రమంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. అనారోగ్య కారణాల రీత్యా తానే స్వయంగా  తప్పుకున్నట్టు సమాచారం.

2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ముందుగానే సుష్మా స్వరాజ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను రాజ్యసభ సభ్యురాలుగా ఎంపిక చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన టీంలో తప్పక చేర్చుకుంటారనే అంచనాలు బలంగానే వినిపించాయి. అయితే  ఈ అంచనాలకు భిన్నంగా ప్రస్తుతానికి సుష్మా మాజీ కేంద్ర మంత్రుల జాబితాలోకి చేరిపోయారు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారోత్సవంలో తేనిటీ విందుకు గైర్హాజరైన సుష్మా  ప్రేక్షకుల వరుసలో జైట్లీ భార్య పక్కన  ఆసీనులయ్యారు. దీంతో ఆమెకు మోదీ టీంలో స్థానం లేదని అందరూ ధృవీకరించుకున్నారు.

మరోవైపు మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్‌కు చోటు దక్కకపోవడంపై ట్విటర్‌ వినియోగదారులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వియ్‌ మిస్‌ యూ మేమ్‌ అంటూ విచారం వ్యక్తం చేశారు. మరికొందరైతే మేడం తిరిగి కావాలి..ఈ విషయాన్ని రీట్వీట్‌ చేయండి.. ట్రెండింగ్‌  చేయండి..తద్వారా ఆమెను కేంద్రమంత్రిగా వెనక్కి తెచ్చుకుందామటూ ట్వీట్‌ చేస్తున్నారు. ఇది ఎన్‌ఆర్‌ఐలకు తీరని లోటని  మరొక యూజర్‌ ట్వీట్‌ చేశారు.  కాగా 2016 డిసెంబరులో సుష్మా స్వరాజ్‌కు మూత్రపిండ మార్పిడి  చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. 

చదవండి : నిండుతనం..చెరగని చిరునవ్వు సుష్మా స్వరాజ్

మరిన్ని వార్తలు