అందుకే కేసీఆర్‌ స్పందించారు: కవిత

19 Dec, 2018 17:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ‘పెద్ద బఫూన్‌’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సమర్థించారు. ఢిల్లీలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... వెర్రి పనులు చేసే వారిని బఫూన్‌గా వర్ణిస్తామని, పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ చేసిన తింగరి చేష్టలను దేశమంతా చూసిందన్నారు. ‘సభా సంప్రదాయాలను ఉల్లఘించి లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ అమాంతంగా వాటేసుకోవడం జాతి యావత్తు వీక్షించింది. రాహుల్‌ చర్యను ప్రతి ఒక్కరు వెర్రి పనిగా భావించారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ కూడా స్పందిచార’ని కవిత వివరించారు.

ప్రాంతీయ పార్టీలదే హవా
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ దారుణంగా వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం రాలేదని, బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీ20 మ్యాచ్‌లా ప్రజలు ఉత్కంఠతో వీక్షించారని చెప్పుకొచ్చారు. రాజస్తాన్‌లో పాత సంప్రదాయం కొనసాగడం వల్లే కాంగ్రెస్‌కు అధికారం దక్కిందని విశ్లేషించారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని అభిలషించారు. ‘ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండివుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని గట్టిగా చెప్పగలను. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు మెరుగ్గా ఉన్నాయ’ని తెలిపారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ తథ్యం
కాంగ్రెస్‌, బీజేపీ లేకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ సాకారమవుతుందని, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలను గుర్తించేలా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీని డీఎంకే నేత స్టాలిన్‌ భావి ప్రధానిగా వర్ణించడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌ అనుకూల కూటమిలో లుకలుకలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్‌ను ఒక పార్టీ సమర్థిస్తే, అదే కూటమిలోని రెండు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ‘మేము ఏర్పాటు చేయాలనుకుంటున్న మూడో ప్రత్యామ్నాయం ఒకరిని ప్రధాని చేయడానికో, ఒక పార్టీని అధికారంలోకి తేవడానికో కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కొనుగొనాలన్న ఉద్దేశంతో థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో మా పార్టీ ఇప్పటికే చేసి చూపించింది. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలుల్లోకి తేవాలనుకుంటున్నామ’ని ఎంపీ కవిత వెల్లడించారు.

మరిన్ని వార్తలు