రాజ్యాంగ వ్యవస్థకు నిమ్మగడ్డ వ్యతిరేకం

23 Jul, 2020 04:50 IST|Sakshi

రాజ్యాంగ పదవిలో ఉండాలంటూనే.. హోటళ్లలో మంతనాలు

రాజకీయ నాయకులను ఆయన ఎందుకు రహస్యంగా కలుస్తున్నారు? 

లాయర్లకు రూ.కోట్ల ఫీజు ఎలా ఇస్తున్నారు?

నిమ్మగడ్డకు టీడీపీ సహకరిస్తోంది 

సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం

మేము వ్యవస్థలను గౌరవిస్తాం 

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చెప్పుకుంటున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీరు సరిగా లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉండాలంటూనే.. హోటళ్లలో టీడీపీ నాయకులతో మంతనాలు జరుపుతుండటంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎస్‌ఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దానిని గౌరవించాల్సిన పని లేదా అని నిలదీశారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా ఆయన ప్రవర్తించడం లేదన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా రాజకీయ నాయకులను ఎందుకు రహస్యంగా కలుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం
► నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల్లో ఉన్నదాన్ని పరిశీలించి కన్సిడర్‌ చేయాలని గవర్నర్‌ ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి వేచి చూద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వ్యవస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మేము వ్యవస్థలను గౌరవిస్తాం. 
► హైకోర్టు తీర్పును, గవర్నర్‌ ఆదేశాలను మేము వ్యతిరేకించడం లేదు. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఆదేశాలపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి. నిమ్మగడ్డ నియామకం వ్యవహారంపై మేము సుప్రీంకోర్టుకు వెళ్లాం. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఇదే విషయాన్ని తెలియజేస్తాం. ఏం చేయాలనే విషయాన్ని ఏజీ నిర్ణయిస్తారు. 
► హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఓడిపోయింది.. నిమ్మగడ్డ రమేష్‌ విజయం సాధించారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. హైకోర్టు తీర్పు టీడీపీ గెలుపు కాదు.. వైఎస్సార్‌సీపీ ఓటమి అంతకన్నా కాదు. రమేష్‌ విజయం అసలే కాదు. ఈ వ్యవహారంలో ప్రజాస్వామ్యం ఓడిపోయింది.
► నిమ్మగడ్డ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ కోసం ఎదురు చూడాలి కానీ ఇలా చేయకూడదు. రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం నిమ్మగడ్డకు లేదా? గంటకు కోట్లలో వసూలు చేసే లాయర్లను నిమ్మగడ్డ సుప్రీంకోర్టులో నియమించుకున్నారు. ఎవరితో స్పాన్సర్‌ చేయించుకుని కోట్లు పెట్టి లాయర్ల ఫీజులు చెల్లిస్తున్నారు?
► స్పష్టంగా రమేష్‌కుమార్‌ నైజం బయటపడింది. ఆయన ప్రభుత్వాన్ని ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారో చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితిలో ఆ పదవికి ఆయన ఏ విధంగా న్యాయం చేస్తారు? 

నిమ్మగడ్డకు సహకరిస్తున్నది బాబు కాదా?
► నిమ్మగడ్డకు సహకరిస్తున్నది.. డబ్బు ఇస్తున్నది చంద్రబాబు కాదా? ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు నిమ్మగడ్డ లాంటి వ్యక్తిని చంద్రబాబు అడ్డుపెట్టుకున్నారు. లాయర్ల కోసం నిమ్మగడ్డకు కోట్ల రూపాయల డబ్బు ఎవరు ఇస్తున్నారో చెప్పాలి. ఈ పరిస్థితిలో ఎస్‌ఈసీ కుర్చీలో నిమ్మగడ్డ కూర్చుంటే అది ఆయన విజయం కాదు.. ప్రజాస్వామ్యం ఓడినట్లే. 
► అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచన. రాష్ట్రంలో సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. ఏదోరకంగా ప్రభు త్వంపై విషం చిమ్మాలని చూస్తున్నారు. పబ్లిసిటీ కోసం శవాలపై కూడా రాజకీయం చేసే దుర్బుద్ధి చంద్రబాబుది.
► చంద్రబాబుకు అధికారంపోయాక ఏం చేయాలో తెలియక, హైదరాబాద్‌లో కూర్చొని జూమ్‌ మీటింగులు పెట్టుకుని ఆ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి.. ఈ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి అంటూ మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక నోట్‌ గవర్నర్‌ నుంచి వ్యతిరేకంగా వస్తే ‘గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి. గవర్నర్‌పై నమ్మకం లేదు’ అని మీలా మేము మాట్లాడం.  
► కరోనా నేపథ్యంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రూ.43 వేల కోట్లు ప్రజలకు బదిలీ అయ్యాయి. అన్ని వర్గాల వారికి న్యాయం చేసే దిశగా సీఎం కృషి చేస్తున్నారు. దళితులకు అండగా నిలిచారు.    
► మంత్రి పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ఉంది. అదే జిల్లాకు చెందిన చంద్రబాబును మాత్రం రాక్షసుడు అంటారు. ఎందుకో మీరే 
ఆలోచించు కోవాలి. 

మరిన్ని వార్తలు