బీజేపీ బండారాన్ని ఆమె బయటపెట్టారు: హరీష్‌రావు

22 Nov, 2023 10:26 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ సర్కార్‌పై చేసిన విమర్శలకు.. బీఆర్‌ఎస్‌ అగ్రనేత హరీశ్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ సర్కార్‌ను ఒత్తిడి చేసిందని.. మీటర్లు పెట్టలేదనే తెలంగాణకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలా సీతారామన్‌ బయటపెట్టారని అన్నారాయన. బుధవారం ఉదయం సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  

‘మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ సర్కార్‌ను ఒత్తిడి చేసింది. కాదంటే రూ.25 వేల కోట్లు ఇవ్వబోమని బ్లాక్‌మెయిల్‌కు దిగింది. కానీ, కేసీఆర్‌ మాత్రం రైతుల పక్షానే నిలిచారు. దేశంలో రైతు పక్షపాతి కేసీఆర్‌ ఒక్కరే. ఢిల్లీనేమో మమ్మలి శెభాష్‌ అంటారు.. ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తారు’ అని నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి  హరీశ్‌ అన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నిర్మలమ్మ

‘కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణ రైతులకు అన్యాయం చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు. ఈ రెండు పార్టీలు పాలిస్తున్న ఆయా రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టాయి. రాజస్థాన్‌లో మోటార్లకు మీటర్లు పెట్టారు. అదే విషయం ఇక్కడ రాహుల్‌ గాంధీ చెప్తారా?.  కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒప్పుకున్నట్లే. ’.. అని తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి హరీష్‌ వ్యాఖ్యానించారు. 

మోదీ హయాంలో 100 లక్షల కోట్ల అప్పు చేశారు. దేశంలోని 22 రాష్ట్రాల కంటే తక్కువ అప్పు తీసుకుంది తెలంగాణనే. మోదీ సర్కార్‌ కార్పొరేటర్లకు రుణ మాఫీ చేసింది కానీ  పేదలను పట్టించుకోలేదు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి బీజేపీనే కారణం. చేనేతలపై.. పాలప్యాకెట్లపై జీఎస్టీ వేసిన ఘనత బీజేపీది అని హరీష్‌ విమర్శించారు. 

మరిన్ని వార్తలు