ఉత్తమ్‌పై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సంచలన ఆరోపణలు

14 Dec, 2018 15:41 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. దేశ వ్యాప్తంగా రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాత్రం తెలంగాణలో పార్టీని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా నైతిక బాధ్యత తీసుకుంటానని చెప్పిన ఆయన పార్టీ అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌​ చేశారు. పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 21 సీట్లు గెలుచుకుందనీ, కానీ ఇప్పుడు 19 సీట్లకే పరిమితమైందని అన్నారు. బీసీలు పీసీసీ ప్రెసిడెంట్‌గా పనికిరారని చెప్పి నాడు పొన్నాలను రాజీనామా చేయించారు. మరిప్పుడు అదే సూత్రం ఉత్తమ్‌కు కూడా వర్తిస్తుంది కదా అని ప్రశ్నించారు. ఉత్తమ్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ 2 సీట్లే గెలుచుకుందని గుర్తు చేశారు. (‘అందుకే కాంగ్రెస్‌లో 20 మంది డమ్మీ అభ్యర్థులు’)

‘రాహుల్‌ గాంధీని తెలంగాణ ప్రజలు నమ్మారు. కానీ, నిన్ను నమ్మడం లేదు. అందుకే ఈ ఘోర పరాజయం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు నీ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో నీకు బుద్ధి చెప్పారు. నువ్‌ హౌజింగ్‌ మినిస్టర్‌గా ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలను బయటపెట్టకుండా ఉండడానికి టీఆర్‌ఎస్‌ పార్టీతో లాలూచీ పడ్డావ్‌. కేసీఆర్‌ చెప్పినట్టు విన్నావ్‌. కుంభకోణాలు బయటపెట్టొద్దని సరెండర్‌ అయ్యావ్‌. గతంలో చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందుగా కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. మైహోమ్‌ రామేశ్వరరావుతో ఉత్తమ్‌ ఒప్పందం చేసుకోవడం వల్లనే కాంగ్రెస్‌ సీట్లను ఆలస్యంగా ప్రకటించింది’ అని ఉత్తమ్‌కుమార్‌పై కాంతం ఆరోపణలు గుప్పించారు.

అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు
‘కోదండరామ్‌ కేసీఆర్‌ సూచించిన మనిషి. ఉద్యకారుడు, మేధావి. ఆయన మేధావితనం వాడుకోవాలి. కానీ, కోదండరామ్‌ టీజేఎస్‌ పార్టీని ఎందుకు కూటమిలో కలిపావ్‌’ అని కాంతం ఉత్తమ్‌కుమార్‌పై విమర్శలు గుప్పించారు. కూటమి ఏర్పాటు విషయంలో ఉత్తమ్‌ జాతీయ నాయకులను తప్పుదోవ పట్టించారని కాంతం విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఉద్యకారుడు కానందునే ప్రజలు ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారని అన్నారు. ‘పార్టీ అంత ఘోరంగా ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాల్సిందిపోయి సిగ్గు లేకుండా మీటింగ్‌ ఎలా పెడుతావ్‌. ఉద్యమకారులను, దళిత నాయకులను కించపరిచావ్‌. టీపీసీసీ ప్రెసిడెంట్‌, సీఎల్పీ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలి’ అని కాంతం డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు