చినబాబు సహకారంతో..రూ.600 కోట్లకు ‘గంటా’రావం

3 Jun, 2018 02:37 IST|Sakshi

     విశాఖలో బినామీ పేర్లతో 358 ఎకరాల అసైన్డ్‌ భూముల కొనుగోలు

     భూసమీకరణ పేరిట ఆ అసైన్డ్‌ భూమి ‘వుడా’కు అప్పగింత!.. ప్రత్యామ్నాయంగా ప్లాట్లు 

     వాటిని విక్రయించుకోవడం ద్వారా రూ.600 కోట్లకుపైగా నొక్కేసేందుకు పన్నాగం

     చినబాబుతో కుమ్మక్కై మంత్రి గంటా పథక రచన..

     సీఎం నుంచి సైతం గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని పేదలకు చెందిన విలువైన 358 ఎకరాల అసైన్డ్‌ భూములను కాజేసి వాటి ద్వారా రూ.600 కోట్లు కొట్టేసేందుకు ఆ ప్రాంత మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి రంగం సిద్ధం చేశారు. గతంలోనే ఇందుకు ప్రయత్నించగా విషయం రచ్చవడంతో అప్పట్లో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన ఆయన తన ప్రయత్నాలు మానలేదు. తెరవెనక మంత్రాంగం కొనసాగించారు. బినామీ పేర్లతో వాటిని కొనేసిన మంత్రి వాటిని చట్టబద్ధం చేసుకునేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించారు. భూసమీకరణ పేరిట విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు ఈ భూములు అప్పగించి.. అందుకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లను సొంతం చేసుకునేందుకు వ్యూహం పన్నారు. ఇందుకోసం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘చినబాబు’తో మాట్లాడి రంగం సిద్ధం చేసుకున్నారు. తద్వారా రూ.600 కోట్లకుపైగా అప్పనంగా కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రతిపాదనకు సీఎం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్‌ లభించడం గమనార్హం.

అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసి...
విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, పెందుర్తి, ఆనందపురం మండలాల పరిధిలో సుమారు 358 ఎకరాల అసైన్డ్‌ భూములను మంత్రి గంటా శ్రీనివాసరావు బినామీ(బంధువులు, సంస్థ ఉద్యోగుల) పేర్లతో చట్టవిరుద్ధంగా కారుచౌకగా కొనుగోలు చేశారు. అసైన్డ్‌ భూములను అమ్మడానికి, కొనడానికి వీలులేదని ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌(పీఓటీ) చట్టం స్పష్టంగా చెబుతోంది. పీఓటీ చట్టం ప్రకారం అసైన్డ్‌ భూముల్ని కొనడం నేరం. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. ‘‘ఈ భూములను వుడా తీసుకుంటోంది. ఇది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన అసైన్డ్‌ భూమి అయినందున వుడా నష్టపరిహారం ఇవ్వకుండా ఉచితంగా లాగేసుకుంటుంది.

మాకు ఇస్తే ఎకరాకు రూ.లక్ష ఇస్తాం.. అంటూ మంత్రి బంధువులు, ఆయనకు చెందిన సంస్థలోని ఉద్యోగులతో ప్రచారం చేయించడం ద్వారా అసైనీల్లో భయం సృష్టించారు. దీంతో ఊరికే భూములు పోగొట్టుకోవడంకంటే ఎంతో కొంత తీసుకుని విక్రయించడం మేలనే భావనతో ఎకరా రూ.లక్ష నుంచి లక్షా ఇరవై వేల ధరతో అమ్మేశారు. మొత్తం 358 ఎకరాలను రూ.40 కోట్లలోపు మొత్తానికే మంత్రి బినామీ పేర్లతో కైవసం చేసుకున్నారు. ఇందులో భాగంగా రికార్డులను సైతం తారుమారు చేశారు. ఈ భూముల్ని అమ్ముకుంటే రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్లదాకా వస్తుంది. అయితే పీఓటీ చట్టం ప్రకారం అమ్ముకోవడం వీలుకాదు. అందువల్ల ఈ భూమిని వుడాకు సమీకరణ కింద కట్టబెట్టి వుడా నుంచి ఎకరాకు 1,120 గజాల చొప్పున ప్లాట్లు తీసుకోవాలని మంత్రి పథకం రూపొందించారు. ఇలా తీసుకున్న ప్లాట్లు మంత్రి బినామీల పేరుతో రిజిస్ట్రేషన్‌ అవుతాయి. దీంతో చట్టబద్ధంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. తమ చేతికి మట్టి అంటనివిధంగా వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ మేరకు భూసమీకరణ కింద ఈ భూములను తీసుకోవాలని వుడాపై ఒత్తిడి తెచ్చారు. ‘చినబాబు’ నుంచి కూడా ఒత్తిడి రావడంతో వుడా మౌఖికంగా అంగీకరించింది. 

సీఎం గ్రీన్‌సిగ్నల్‌
వుడా భూసమీకరణకు అనుమతించాలని విశాఖ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ గత నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులో కోరగా సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ‘గతంలో ఈ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. మళ్లీ ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ వుడా భూ సమీకరణ ప్రతిపాదనకు సీఎం పచ్చజెండా ఊపడం గమనార్హం. 

రూ.40 కోట్ల పెట్టుబడికి రూ.600 కోట్లకుపైగా రాబడి..
భూసమీకరణ కింద మంత్రి బినామీల నుంచి 358 ఎకరాలను సమీకరించినందుకు ప్రతిగా వుడా వారికి ఎకరాకు 1,120 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వాలని ప్రతిపాదనలతో గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు రావడం, విశాఖ ప్రాంతానికి చెందిన మరో మంత్రి స్వయంగా మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేయడంతో ఇది ఆగిపోయింది. అయితే ఇప్పుడు గత ప్రతిపాదనల ప్రకారమే ముందుకు వెళుతున్నారు. ఆ మేరకు 358 ఎకరాల సమీకరణకుగాను భూయజమానులైన బినామీలకు వుడా 4,00,960 గజాల మేరకు ప్లాట్లను ఇవ్వాల్సి ఉంటుంది.

వుడా ఇవ్వడానికి ప్రతిపాదించిన ప్రాంతంలో గజం విలువ రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఉంది. కనిష్ట ధరను ప్రామాణికంగా తీసుకున్నా గజానికి రూ.15,000 ప్రకారం 400960 గజాలకు రూ.601.44 కోట్లు అవుతుంది. మధ్యస్తంగా గజం రూ.17,000 ధరతో విక్రయిస్తే రూ.681.63 కోట్లు వస్తుంది. ఏతావాతా రూ.40 కోట్లతో మంత్రి కొట్టేసిన అసైన్డ్‌ భూమిని వుడాకు కట్టబెట్టడం ద్వారా ఆయన కొట్టేసే మొత్తం రూ.600 కోట్లుపైమాటే. ఇందులో చినబాబు, మంత్రి పంచుకోగా మిగిలిన దానిలో కొంత మొత్తాన్ని ఎన్నికల ఖర్చుకోసం ఇస్తామని మంత్రివర్యులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ విషయంపై ఇక రాద్ధాంతం చేయవద్దని చినబాబు మరో మంత్రికి హితవు పలికినట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు