చంద్రబాబు గొర్లకాపర్లను అవమానించాడు

31 Oct, 2018 02:53 IST|Sakshi

మహాకూటమి ఓ దొంగల ముఠా

యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు హరీశ్, తలసాని ధ్వజం 

సాక్షి, గజ్వేల్‌: చంద్రబాబు గతంలో సీఎంగా పనిచేసిన కాలంలో యాదవుల గొర్లకాపరుల వృత్తిని అవమానించారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో చంద్రబాబును నమ్ముకొని అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నించడం సిగ్గుచేటని మంత్రి మండిపడ్డారు. మంగళవారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మం త్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, హరీశ్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా హరీశ్‌ కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డారు. సిద్ధాంతాలకు, విలువలకు తిలో దకాలిచ్చి చంద్రబాబుతో దోస్తీ కట్టడమేగాకుండా బాబు సాయంతో అధికారంలోకి రావాలనుకునే కుట్రను ప్రజలు గమనిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఖాళీ అయిన తన పార్టీకి తొవ్వ పుడుతుందేమోనన్న ఆశతో చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే పార్టీలతో జతకడితే ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌కు అర్థమవుతుందన్నారు. ఇటీవల తెలంగాణ సీఎంను కలిసిన కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి రేవన్న గొర్రెల పంపిణీ పథకంపై ప్రశంసల వర్షం కురిపించారని ప్రస్తావించారు.

ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కంటి వెలుగు శిబిరాల్లోకి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. మహాకూటమి దొంగల ముఠాను తలపిస్తోందన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, 24గంటల విద్యుత్‌ సరఫరా లాంటి పథకాలను ఎత్తేసి...ఈ బడ్జెట్‌ను రూ. 2 లక్షల రుణమాఫీ కోసం వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్‌కు  ఆంధ్రా పోలీసుల నుంచి రూ. 4 కోట్లు అక్రమ డబ్బు వచ్చిందని ఆరోపించారు.

ఈ సమ్మేళనంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్యయాదవ్, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్‌ రాజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూక్‌ హుస్సే న్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్‌ చైర్మన్లు భూపతిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మెదక్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాజమణి, ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు మురళీ యాదవ్, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్, అఖిలభారత యాదవ మహాసభ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవియాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోచబోయిన శ్రీహరియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటుతో బుద్ధి చెప్పండి
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర ఈ గడ్డపై ఉందని, కౌరవ సైన్యం లాంటి మహాకూటమికి ఓటుతో బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళ వారం సిద్దిపేటలో వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి హరీశ్‌ ఆహ్వానించారు. అనంతరంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం 20 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి అక్కడి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందని హరీశ్‌ అన్నారు. సిద్దిపేట ప్రచారం బాధ్యత కార్యకర్తలకే వదిలేస్తున్నానని.. కోహ్లిలా సెంచరీ కొట్టి లక్ష మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. మహాకూటమిలో టీడీపీ భాగస్వా మ్యం కావడం వెనుక ఆంధ్రాబాబుల కుట్ర ఉందని హరీశ్‌రావు ఆరోపించారు.  
 

మరిన్ని వార్తలు