బాబు నుంచి హామీ ఏదైనా తీసుకున్నారా?

10 Nov, 2018 14:47 IST|Sakshi

మహాకూటమి నేతలకు హరీష్‌ రావు ప్రశ్న

సాక్షి, ఇబ్రహీంపట్నం : మహాకూటమిని వేదికగా చేసుకుని తాజా మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పాలమూరు దిండి ప్రాజెక్టు అక్రమైనదని కేంద్ర మంత్రి ఉమా భారతికి గతంలో లేఖ రాసిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణలో ఏవిధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఆంధ్ర ప్రభుత్వం నిన్న దిండి ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. దానిని ఖచ్చితంగా అడ్డుకుంటామని ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే వారికి మనం ఓట్లు ఎందుకు వెయ్యాలి. చంద్రబాబు తెలంగాణలో ఒక్కమాట.. ఆంధ్రలో ఒక్కమాట మాట్లాడుతున్నారు. మహాకూటమికి ఓటేస్తే మన అస్థిత్వాన్ని బాబు దగ్గర తాఖట్టు పెట్టినట్టే. కూటమిలో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు వద్ద ఏమైనా హామీ తీసుకున్నారా?. రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేయాలంటే కేసీఆర్‌కు ఓటు వేయ్యాలి. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఢిల్లీ పోతుంది. టీడీపీకి వేస్తే అమరావతి.. టీజేఎస్‌కు వేస్తే వృధా అవుతుంది’’ అని పేర్కొన్నారు.


ఎన్నో పదవులు త్యాగం చేశా..
ఆయన మాట్లాడుతూ.. ‘‘సంక్షేమం​ కావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి. సంక్షోభం కావాలంటే మహాకూటమికి వేయ్యండి. తెలంగాణ కోసం ఎన్నో పదవులను తృణప్రాయంగా వదిలిన వాడిని. నన్ను ఎంత తిడితి అంత బలంగా తయారవుతా. డిసెంబర్‌ ఏడు తరువాత తెలంగాణలో టీడీపీ ఉండదు. ఉమ్మడి మహూబూబ్‌ నగర్‌ జిల్లాలో వలసలకు వెళ్లిన వారుతిరిగి వచ్చారు. కల్వకుర్తి ఇరిగేషన్‌ ద్వారా ఆ ప్రాంతం సస్యశ్యామలమైంది. వలసలు వెళ్లిన వాళ్లను మనం తీసుకువస్తే... కాంగ్రెస్‌ వాళ్లు పొలిమెర దాక పోయి టీడీపీ వాళ్లను తిరిగి తీసుకువస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు చంద్రబాబు చేతిలో ఉంది.. వారికి పట్టం కడితే మనకు నీళ్లు వస్తాయా?. గత నాయకులు తెలంగాణ రైతులను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి. ఏ రాష్ట్రంలో అభివృద్ది చేయని చెరువులను మనం సాకారం చేసుకున్నాం’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు