35 ఏళ్ల తర్వాత గెలవబోతున్నాం : జైరాం రమేష్‌

26 Nov, 2018 14:37 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి : నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని దివాలా తెలంగాణగా మార్చారని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్‌ మండిపడ్డారు. కేవలం ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కేసీఆర్‌ కుటుంబం కోసం కాదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భువనగిరిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలంగాణ ఏర్పడలేదని జైరాం రమేష్‌ వ్యాఖ్యానించారు. విభజన హామీలను అమలు చేయడంలో, చేయించుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మొట్టమొదటిసారిగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందని, వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ మహిళను హోం మంత్రి చేశామని గుర్తు చేశారు. తెలంగాణలో ఇకపై టీఆర్‌ఎస్ పాత అంబాసిడర్ కారుకు చోటు లేదని ఎద్దేవా చేశారు. సంజీవని దొరికింది కాబట్టి.. 35 ఏళ్ల తర్వాత భువనగిరిలో కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు.
 

మరిన్ని వార్తలు