ఆ ఇద్దరూ జగనన్నకు దూరం కారు

17 Feb, 2019 12:57 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమారెడ్డి

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

నెల్లూరు, కావలి: మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డిలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే అభిమానమని, వారిద్దరూ జగనన్నకు దూరం కారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కావలిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి, అదే అభిమానాన్ని జగన్‌మోహన్‌రెడ్డిపై పెంచుకున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండటానికి విష్ణువర్ధన్‌రెడ్డికి ఇష్టమే కానీ, ఎవరో ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి పక్కదోవ పట్టిస్తున్నారనేది తన అభిప్రాయమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరికన్నా విష్ణువర్ధన్‌రెడ్డికే ఉందని ఎమ్మెల్యే అన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీలో అన్ని రకాల హక్కులు ఉన్నాయన్నారు. ఆయన మాటను తామందరం గౌరవించాల్సిందే అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే విష్ణువర్ధన్‌రెడ్డి ద్వారా ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన పనులు చేయడానికి తాము ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జిల్లాలో విష్ణువర్ధన్‌రెడ్డికే పెద్దపీట వేస్తారనే విషయం తమకు తెలుసన్నారు. మరో రెండు నెలల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండడంలో విష్ణువర్ధన్‌రెడ్డి భాగస్వామ్యం కూడా ఉండి చరిత్రలో ఆయన పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుందని నమ్ముతున్నానని ఎమ్మెల్యే అన్నారు. అలాగే చంద్రబాబు, టీడీపీలో ఉన్న నాయకుల వల్ల ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీలో సముచితమైన గౌరవం ఉంటుందన్నారు. తనకు వేణుగోపాల్‌రెడ్డిపై ప్రత్యేక గౌరవం ఉందన్నారు. చంద్రబాబు మోసాలు గురించి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కథలుగా చెబుతూ ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని, కానీ వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి ఎనిమిదేళ్ల క్రితమే చంద్రబాబు మోసాల గురించి బాగా తెలుసునని, అందుకే వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనా విధానాన్ని, వైఎస్సార్‌సీపీ దృక్పథాన్ని బలంగా వినిపించిన వంటేరు వేణుగోపాల్‌రెడ్డి లాంటి నాయకుడు జగనన్నకు దూరం కారని ఎమ్మెల్యే అన్నారు. కావలి ప్రాంత సమస్యలు, ప్రజల మనోభావాలపై సమగ్రమైన అవగాహన ఉన్న వేణుగోపాల్‌రెడ్డి పార్టీలో ఉండి ఉన్నతమైన గౌరవాన్ని అందుకొంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు