Fact Check: రోడ్డున పడ్డది రామోజీ పరువే..

7 Nov, 2023 04:42 IST|Sakshi

మరోసారి అక్కసు వెళ్లగక్కిన రాజగురువు 

తెలంగాణకు కితాబు.. ఏపీ రహదారులపై విషం  

వాస్తవానికి తెలంగాణ పరిధిలోనే అధ్వానంగా రోడ్లు  

అయినా ఏపీలో రోడ్లు బాలేదంటూ ‘ఈనాడు’ కథనం 

రోడ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం 

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వేగంగా రోడ్ల నిర్మాణం  

సాక్షి, అమరావతి: డబుల్‌ రోడ్డు కనిపిస్తే తెలంగాణ అని,సింగిల్‌ రోడ్డు వస్తే అది ఏపీ అని జనం అనుకుంటున్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఓ ఎన్నికల సభలో ఓ అడ్డగోలు ప్రసంగం చేస్తే దానిని పట్టుకుని ఎల్లో మీడియా రాజగురువు శివాలెత్తిపోయారు. తెలంగాణలో బాగున్న రోడ్లు, ఏపీలో బాలేని రోడ్లు కొన్ని ఏరుకొచ్చి అచ్చేసి చంకలుగుద్దుకున్నారు. ఏపీలో నిగనిగలాడేరోడ్లు ఆయన ‘ఎల్లో’ కామెర్ల కళ్లకు కనిపించవు. ఇక తెలంగాణలోని గుంతల రోడ్లు కనిపిస్తాయని ఎలా అనుకుంటాం. ఇక కేసీఆర్‌ అతిశయం.. తన అక్కసు రాతలు.. కలగలిపి రాష్ట్రంలో రోడ్లపై రామోజీరావు మరోసారి విషం చిమ్మారు.

హ్రస్వదృష్టితో ఓ అవాస్తవ కథనాన్ని వండివార్చారు. ‘రాష్ట్రం పరువు రోడ్డున పడేశారు’ అంటూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు తన ఈనాడు పత్రిక ద్వారా ప్రయత్నించారు. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పునరుద్ధరిస్తోందన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా ఆ కథనంలో విస్మరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఎప్పటిలాగే అక్కసు వెళ్లగక్కారు. రామోజీ వక్రబుద్ధిని రాష్ట్రంలోని రోడ్ల స్థితిగతులే బయటపెట్టాయి. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోనే రోడ్లు మెరుగ్గా ఉన్నాయన్నది స్పష్టమైంది. దాంతో ఈనాడు రామోజీరావు పరువే రోడ్డున పడింది. 

చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం
క్రమం తప్పకుండా చేపట్టాల్సిన రోడ్ల మరమ్మతులు, నిర్వహణను గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల పునరుద్ధరణ పనులను చేపట్టింది. వరుసగా రెండేళ్లు భారీ వర్షాలతో పాటు కోవిడ్‌ పరిస్థితులు తగ్గిన తరువాత యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసింది. దాంతో రాష్ట్రంలో రోడ్లు మెరుగయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నుంచి 2019 వరకూ ఆర్‌అండ్‌బీ రోడ్లపై రూ. 3,335.3౦ కోట్ల పనులు చేస్తే బిల్లులు మాత్రం రూ. 2,772.6 కోట్లు మాత్రమే చెల్లించారు. దాదాపు రూ. 562.7 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ. 471.15 కోట్ల పనులు చేస్తే బిల్లులు మాత్రం రూ. 387.78 కోట్లు విడుదల చేశారు. రూ. 86.37 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. అంటే 2014–19 మధ్య కోవిడ్‌ లాంటి పరిస్థితులు లేకపోయినా, భారీ వర్షాలు లేకపోయినా ఈరెండు శాఖల పరిధిలో రూ. 3,160.38 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 

యుద్ధ ప్రాతిపదికన పనులు 
వైఎస్సార్‌సీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌అండ్‌బీ పరిధిలో నూతన రహదారులు నిర్మాణం, రహదారుల వెడల్పు, సింగిల్‌ రోడ్లను డబుల్‌ రోడ్లుగా మార్చడానికి రూ.3,371 కోట్లు ఖర్చు చేశారు. వాటితోపాటు రహదారుల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ. 5,342 కోట్లు వెచ్చించారు.

► గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.236 కోట్లతో ఇప్పటివరకు 473.43 కి.మీ. మేర రహదారులు నిర్మించారు. ఇదే శాఖలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 273.53 కోట్లతో 231.50 కి.మీ. మేర గ్రావెల్‌ రోడ్లు వేశారు. దాంతో 433 హేబిటేషన్స్‌కు రహదారి సౌకర్యం కలిగింది. రూ. 99.06 కోట్ల వ్యయంతో మరో 306 హేబిటేషన్స్‌లో 129.70 కి.మీ. మేర మెటల్‌ రహదార్లు నిర్మించారు. 359 హేబిటేషన్స్‌లో రూ. 56.25 కోట్ల వ్యయంతో 255.70 కి.మీ. మేర బీటీ రహదార్లు వేశారు. 36 హేబిటేషన్స్‌లో రూ. 29.84 కోట్ల వ్యయంతో 38.56 కిలోమీటర్ల సిమెంట్‌ రహదార్లు నిర్మించారు.

► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఏపీఆర్‌ఆర్‌పీ కింద రూ. 1,273.82 కోట్లతో  2,334 కి.మీలు., పీఎంజీఎస్‌వై పథకంలో రూ.1,877.49 కోట్లతో 2,971 కి.మీలు., నాబార్డు నిధులు రూ.224.38 కోట్లతో 425 కి.మీలు., జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 2,068 కోట్లతో 5,983 కి.మీ. మేర బీటీ, సీసీ రహదారులు నిర్మించారు. 

► ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిధిలో దాదాపుగా 11,500 కి.మీలు., పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి పరిధిలో దాదాపు 1,394.34 కి.మీ. నిడివి ఉన్న రోడ్లకు.. మొత్తంగా 12,894 కి.మీ మేర రోడ్లకు మరమ్మతులు చేశారు. 

తెలంగాణ వార్తలు రాసే ధైర్యం లేదా రామోజీ
తెలంగాణలో రోడ్ల దుస్థితిని ఉద్దేశ పూర్వకంగా పట్టించుకోలేదన్నది ఈనాడు రాతల్లో స్పష్టమవుతోంది. ఆ రాష్ట్రంలో బిల్లులు మంజూరు చేయలేదని కాంట్రాక్టర్లు ఇటీవల ధర్నాలు చేశారు. ఆ వార్త ప్రచురించేందుకు మాత్రం రామోజీరావుకు ధైర్యం సరిపోలేదు. అసలు తెలంగాణలో కాంట్రాక్టర్లు ధర్నా చేశారనే విషయాన్ని పట్టించుకోలేదు. అటువంటి రామోజీరావు ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రోడ్లు నిర్మిస్తున్నా దుష్ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉంది. 

ఇటు వాస్తవాలను చూడలేరా!
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుండటంతో ఈనాడు పత్రిక ద్వారా రోజుకో రీతిలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ‘పచ్చ’గురువు రామోజీరావు పనిగా పెట్టుకున్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏపీ–తెలంగాణ సరిహద్దుల్లో రోడ్ల పరిస్థితిపై వాస్తవాలను వక్రీకరించారు. రామోజీరావు వాస్తవాలు విస్మరించినా.. ప్రజలు మాత్రం నిజాలను గుర్తిస్తూనే ఉన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో తెలంగాణ సరిహద్దుల వద్ద రోడ్లను పరిశీలిస్తే ఆ వాస్తవాలు తెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో కొత్తగా నిర్మించిన రోడ్లు దర్శనమిస్తుండగా.. తెలంగాణ పరిధిలో రోడ్లు పూర్తిగా గుంతలతో నిండి ఉన్నాయనే వాస్తవం కళ్లకు కనపడుతుంది. 

మరిన్ని వార్తలు