ఏ గట్టునుంటారో ప్రజలే తేల్చుకోవాలి

15 Nov, 2018 01:56 IST|Sakshi
ఖమ్మం జిల్లా మధిర బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

కరెంటు అడిగినందుకు కాల్చి చంపిన చరిత్ర టీడీపీది

సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేట సభల్లో మంత్రి కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, కొత్తగూడెం: కరెంట్‌ అడిగిన పాపానికి కాల్చి చంపిన టీడీపీ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచిన కాంగ్రెస్‌ పార్టీలు ఒకవైపు.. అన్ని వర్గాల ప్రజల చెంతకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకెళ్లిన కేసీఆర్‌ మరోవైపు ఉన్నారని, ఈ రెండు పక్షాల మధ్య ఏ గట్టున ఉంటారో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో.. ఈ నాలుగున్నర టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా కనపడుతోందని చెప్పారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు, ఆ పార్టీతో జట్టు కట్టిన చంద్రబాబు వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటే రాజకీయంగా ఎదగవచ్చు అనుకోవడం పొరపాటన్నారు. 

కూటమిది పగటి కలలు
మహాకూటమి నేతలు ఏదో సాధిస్తామని పగటి కలలు కంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, వారి సీట్లు పంపకం జరిగే లోపు తమ పార్టీ స్వీట్లు పంచుకుంటుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. సత్తుపల్లి ప్రాంతానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తెచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కృషి చేశారన్నారు. పాలేరు ప్రజలకు భక్తరామదాసు ద్వారా సాగు నీటిని అందించకుండా ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కేసీఆర్‌ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేని చంద్రబాబు.. ‘పిల్ల కాంగ్రెస్‌’ లా అవతారమెత్తి కాంగ్రెస్‌ పార్టీతో అనైతిక పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. మన వేలితో మన కంటినే పొడిచేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. మిగిలిన ప్రాజెక్టుల విషయంలోనూ చంద్రబాబు కోర్టులకు వెళ్తుండగా, నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కేసులు వేస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. 

పెట్టుబడి ఎకరాకు రూ.10 వేలు 
మళ్లీ అధికారంలోకి వస్తే పంట పెట్టుబడి ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మరో 50 ఏళ్లు అభివృద్ధి వెనక్కు వెళుతుందని అన్నారు. చంద్రబాబు కుట్ర బుద్ధితో జిల్లాలోని ఆరు మండలాలను కలుపుకున్నారని, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలను కూడా కలుపుకోవాలని చూస్తే కాపాడుకున్నామని చెప్పారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే కాంగ్రెస్‌ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తూ ప్రజారంజక పాలన అందించిన కేసీఆర్‌కు ప్రజలు మరోసారి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.

భట్టికి చెక్‌ పెట్టాలి 
మధిరలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజును గెలిపించడం ద్వారా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కకు చెక్‌ పెట్టాలని కేటీఆర్‌ కోరారు. నాలుగున్నరేళ్లలో భట్టి విక్రమార్క మధిర ప్రజల కోసం ఫలానా పని చేయమని ప్రభుత్వాన్ని అడిగిందే లేదని, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న తన దృష్టికి ఏ ఒక్క సమస్యను తేలేదని చెప్పారు. కుటుంబ పాలన అని పదేపదే చెబుతున్న భట్టి.. తన కుటుంబంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేశారో.. ఇప్పుడు ఆయన విజయానికి కుటుంబ సభ్యులందరూ ఏవిధంగా తిరుగుతున్నారో జిల్లా, రాష్ట్ర ప్రజలకు తెలియనిది కాదన్నారు. సత్తుపల్లిలో పిడమర్తి రవిని గెలిపించడం ద్వారా నియోజకవర్గం మరింత సస్యశ్యామలం కావడానికి దోహదపడాలన్నారు. 

అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే ముగ్గురు ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌ ఒకరని, ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తర్వాత కేసీఆర్‌ తమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

మరిన్ని వార్తలు