దొర పాలనకు మరో అవకాశమా..?

28 Nov, 2018 03:11 IST|Sakshi

‘మీట్‌ ది ప్రెస్‌’లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ

ప్రజలు కలిసేందుకు సమయమివ్వని సీఎం కేసీఆరే..

4న ఆచరణ సాధ్య హామీలతో సీఎంపీ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దొర పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు తన ను కలిసేందుకు సమయం ఇవ్వని సీఎం దేశంలో కేసీఆర్‌ ఒక్కరేనని విమర్శించారు. ధర్నాచౌక్‌ను ఎత్తేసి ప్రజల గొంతును నొక్కేశారని, ప్రతిపక్షాలు లేకుండా చేసి రాష్ట్రాన్ని దొరతనంలోకి నెట్టేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు 4 పార్టీలు కలసి కూటమిని ఏర్పాటు చేశాయని, ప్రజలు మద్దతిచ్చి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళవా రం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ దివాలా తీయించారని అన్నారు. టీఆర్‌ఎస్‌ నలుగురు కుటుం బ సభ్యుల పార్టీ అని, 4 పార్టీల జట్టు కూటమి అని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా 53 నెలలు పబ్బం గడిపారని విమర్శించారు.  

వచ్చే నెల 4న సీఎంపీ అంశాల ప్రకటన 
రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీని రాష్ట్రంలో లేకుండా చేస్తానన్న కేసీఆర్‌ విశ్వసనీయత ఏమిటో ప్రజలకు అర్థమవుతోందని రమణ చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు. నాలుగు పార్టీలతో ఏర్పడిన కూటమి సుదీర్ఘంగా చర్చించి ఆచరణ సాధ్యమయ్యే కార్యక్రమాలే చేపట్టిందని.. పార్టీల వారీగా మేనిఫెస్టోలు ప్రకటించినప్పటికీ వచ్చే నెల 4న సీఎంపీ (కామన్‌ మినిమమ్‌ ప్రోగాం) అంశాలను విడుదల చేస్తామని చెప్పారు. జమిలి ఎన్నికలకు ముందు మద్దతు పలికిన కేసీఆర్‌.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాడో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్‌ దోచుకున్న ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం రాగానే బయటకు వెలికితీస్తుందని తెలిపారు. 

ప్రజాపాలన కోసం సీటు త్యాగం 
కూటమిలో టీడీపీ కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ సీట్ల సర్దుబాటులో భాగంగా తాను పోటీ చేయడం లేదని రమణ స్పష్టం చేశారు. ప్రజాపాలన కోసమే తను సీటును త్యాగం చేశానని చెప్పారు. సిరిసిల్లలో ఇసుక మాఫియాను నడిపించిన కేటీఆర్‌ నిజస్వరూపమేమిటో ప్రజలు గుర్తించాలన్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్లు పొందిన అభ్యర్థులను నియోజకవర్గాల్లో ప్రజలు ప్రతిఘటిస్తున్నారని, కేసీఆర్‌ నిరంకుశ పాలనతో ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.  

ఆ పార్టీల దోస్తీతో ముంచే ప్రయత్నం 
ఓ వైపు బీజేపీ, మరోవైపు ఎంఐఎం పార్టీలను పెట్టుకుని కేసీఆర్‌ ప్రజలను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తున్నారని రమణ దుయ్యబట్టారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి భయపడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత 100 సీట్లలో గెలుస్తామన్న కేసీఆర్‌ ధీమా క్రమంగా సన్నగిల్లిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, రైతు సంక్షేమమే ఎజెండాగా పాలన సాగుతుందని చెప్పారు. ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ, రూ.10 వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి, ప్రతి పంటకు మద్దతు ధర, ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు