గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాలి: లక్ష్మణ్‌

12 Nov, 2017 03:47 IST|Sakshi

ఆర్మూర్‌ గల్ఫ్‌ బాధితుల పోరుబాట 

ఆర్మూర్‌: విలాసాల కోసం సచివాలయం, అసెంబ్లీ, రవీంద్రభారతి వంటి భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించడం మాని.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన సమస్య అయిన గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో బీజేపీ అనుబంధ సంస్థ అయిన ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్తర తెలంగాణ జిల్లాల గల్ఫ్‌ బాధితుల పోరుబాట పేరిట శనివారం ఇక్కడ జరిగింది.  

లక్ష్మణ్‌ మాట్లాడుతూ  అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెడుతూ వారికి వేతనాలు పెంచుతూ గల్ఫ్‌ బాధితుల సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన సచివాలయం ఒకవైపు ఖాళీగా ఉంటే.. అసలు సచివాలయానికే రాని సీఎం కొత్త సచివాలయ భవన నిర్మాణానికి రూ. వందల కోట్లు వెచ్చించడం తగదన్నారు. ఉపాధి కోసం ఎడారి దేశం వెళ్లి అక్కడే మృత్యువాత పడటంతో వారి కుటుంబసభ్యులు వీధిన పడే పరిస్థితి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రతిరోజు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి గల్ఫ్‌ బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్య తీవ్రతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు ఊరట కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచంద్రరావు, బీడీ కార్మికుల సంక్షేమ నిధి జాతీయ ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి మాట్లాడారు.   

మరిన్ని వార్తలు